Magazines

సీఎంకు.. ఎమ్మెల్యేకు సోయి లేదా..?

03 సెప్టెంబర్, 2026

hospital
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 2 నిమిషాల చదవడం

ఆస్పత్రి ఓపెన్‌ చేసి వదిలేస్తారా?

వారం రోజుల్లో 100 పడకల ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలి.. లేదంటే ఆస్పత్రి ఎదుట ధర్నా చేస్తాం: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

నవతెలంగాణ -పరకాల 
పనులు పూర్తికాకుండానే పరకాల 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని హడావుడిగా ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సోయి లేదా.. స్థానిక ఎమ్మెల్యేకు సోయి లేదా అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన పరకాల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.ఆస్పత్రిలో ఒకే బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి చూసి బాధ కలిగిందని ధర్మారెడ్డి అన్నారు. పరకాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే ఆస్పత్రి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రికి రంగులు వేసి, అవసరమైన పనులు పూర్తికాకుండానే హడావుడిగా ప్రారంభించారని ధర్మారెడ్డి ఆరోపించారు. ఆస్పత్రి ప్రారంభించి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండా ముఖ్యమంత్రి ఆస్పత్రిని ప్రారంభించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.


ప్రారంభోత్సవం రోజే ఆస్పత్రికి అవసరమైన నిధులను ఎందుకు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. వారం రోజుల్లోగా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మరోసారి ఆస్పత్రిని సందర్శించి, ప్రజల తరఫున ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహిస్తామని చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అలియాబాద్ సర్పంచ్ సనత్, మాజీ ఎంపిటిసి సాయి తిరుపతి రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్క చిరంజీవి బీఆర్‌ఎస్‌ నాయకులు,కోడెపాక కరుణాకర్,నల్లెల లింగమూర్తి,బండి శ్రావణి,కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఆస్పత్రి నుంచి రాగానే పోలీసుల దాడి..!

బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల: నడికూడ మండలం రాయపర్తి గ్రామానికి చెందిన ఆల్లె సందీప్‌పై పోలీసులు దాడి చేయడం దారుణమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన సందీప్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం గురువారం గ్రామానికి తిరిగి రాగా, పరకాల పోలీసులు అతడిని ప్రశ్నించి తీవ్రంగా కొట్టారని ఆయన పేర్కొన్నారు.పోలీసుల దాడిలో సందీప్‌ మళ్లీ గాయపడటంతో, పోలీసులే అతడిని పరకాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించారని ధర్మారెడ్డి తెలిపారు.


పోలీసుల దాడిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సమగ్ర విచారణ జరిపి, ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సందీప్‌కు మెరుగైన వైద్యం అందించి, న్యాయం చేయాలని కోరారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ విధానానికి భిన్నంగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి మారిందని ధర్మారెడ్డి విమర్శించారు. ప్రజలతో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్