Magazines

మోడీ సహకరించట్లే

52 నిమిషాల క్రితం

Modi is not cooperating.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 3 నిమిషాల చదవడం

​నార్త్ వర్సెస్ సౌత్ కాదు..గుజరాత్ వర్సెస్ కంట్రీ బ్రిటిషర్స్
సైమన్ కమిషన్ లాగా మోడీ ఎలక్షన్ కమిషన్
పేదల ఓటు హక్కు హరించేందుకే సర్
నిధులన్నీ గుజరాత్ కు తరలించుకెళ్తున్నారు
దేశవ్యాప్తంగా 20 కోట్ల ఓట్లు తొలగించాలని కుట్ర
2029 ఎన్నికల కోసం ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగింపు
దేశంలో జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయి!
అధికారాలన్నీ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కే ఇస్తే ఇక బీఎల్వోలు, కలెక్టర్లు ఎందుకు? : ఢిల్లీలో అస్సాం దిన‌ప‌త్రిక కాంక్లేవ్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ : ప్రధాని మోడీ చెప్పుకునే గుజరాత్ మోడల్ ఆనాటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారంతోనే సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ మోడల్, అభివృద్ధికి మోడీ సహకరించట్లేదనీ, నిధులన్నీ గుజరాత్ కు తరలిస్తున్నరని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం సోమవారం అస్సాం దిన‌ప‌త్రిక ప్రతిదిన్‌ కాంక్లేవ్‌–2026 లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అసోమియా ప్రతిదిన్, ప్రతిదిన్ టైమ్స్ ఛానల్ బిజినెస్ డెవలప్‌‌మెంట్‌ డైరెక్టర్ రిషి బారువా అడిగిన ప్రశ్నలకు ‌సీఎం సమాధానాలు ఇచ్చారు. మెట్రో విస్తరణ, రీజనల్‌ రింగ్ రోడ్డు(త్రిపుల్ ఆర్), జాతీయ రహదారుల వంటి రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి విజ్ఞప్తులు ఇంకా ప్రధాని దగ్గర పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పారు. 360 కిలో మీటర్ల త్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ పూర్తిగా మంజూరు అయి, టెండర్లు పిలిచిన తర్వాత కూడా, ఆ ఫైల్ రెండెడ్లుగా పీఎంఓ లోనే పడి ఉందన్నారు. కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంలో చేతులెత్తేశారన్నారు. ప్రధాని మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారనీ, క్యాబినేట్ నుంచి ఆమోదం పొందాలని చెబుతున్నారన్నారు. తెలంగాణకు వచ్చిన సెమీకండక్టర్ ప్రాజెక్ట్‌‌ను చివరి రోజు ప్రధాని గుజరాత్ కు తరలించుకుపోయారన్నారు.

గుజరాత్ వర్సెస్ కంట్రీ
గుజరాత్ కు మోడీ అంబాసిడర్ గా మారి, బెదిరించి, భయపెట్టి ప్రాజెక్ట్ లను తన సొంత రాష్ట్రానికి తీసుకెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కానీ ఎంపీగా తానే ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ర్టాల పట్ల మోడీ చూపిస్తున్న పక్షపాతం నార్త్ వర్సెస్ సౌత్ కాదని... గుజరాత్ వర్సెస్ మిగిలిన అన్ని రాష్ట్రాలని ఫైర్ అయ్యారు. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలోనూ బీజేపి పాలిత ప్రభుత్వమే ఉందని, కానీ మోడీ కేవలం గుజరాత్ కు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారని విమర్శించారు.​
​ బీఎల్ ఓలు, కలెక్టర్లు ఎందుకు?
ఓట్ల తొలగింపు టెక్నాలజీని పూర్తిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మార్చేసారని సీఎం చెప్పారు. అన్ని అధికారాలు సీఈసీకే ఇస్తే ఇక బూత్ లెవల్ ఆఫీసర్లు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్లు, కలెక్టర్లు ఎందుకు అని ప్రశ్నించారు. పేదలకు ఓటు పేరుతో రాజ్యాంగం శక్తిని ఇచ్చిందనీ, అదే ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్పారు.

సైమన్ కమిషన్ మాదిరే ఎలక్షన్ కమిషన్
బ్రిటిషర్స్ సైమన్ కమిషన్ లాగా కేంద్ర ఎన్నికల సంఘం మోడీ ఎలక్షన్ కమిషన్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 20‌‌14 లో ప్రధానిగా తొలి సారి మోడీ ప్రమాణం చేసినప్పుడు దేశ ఓటర్ల సంఖ్య 81 కోట్లుగా ఉందన్నారు. 2019 కి ఓటర్ల సంఖ్య 91 కోట్లకు చేరిందని, 2024 లో ఈ సంఖ్య 97 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశం 2029 ఎన్నికల వైపు పయనిస్తుంటే, ఇప్పటి వరకు 13 కోట్ల ఓట్లను సర్ తో తొలగించారని వివరించారు. దేశంలో ప్రజల సంఖ్య పెరుగుతున్నదో, తగ్గుతున్నదో ప్రధానే సమాధానం చెప్పాలన్నారు. 2029 ఎన్నికల నాటికి 20 కోట్ల ఓట్లను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారనీ, ఎవరైతే తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో... వారిని ఆర్టిఫిఫియల్ ఇంటలిజెన్స్ తో గుర్తించి ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్య కాలంలో సైమన్ గో బ్యాగ్ నినాదంతో దేశం ఏకమైందని, రాబోయే రోజుల్లో సర్ గో బ్యాక్ నినాదంతో మళ్లీ దేశం ఒకటి అవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
సంక్షేమంలో ఫస్ట్‌
పదవ తరగతి తర్వాత ప్రయివేటు కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల కోసం ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2500 కోట్ల ను ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లిస్తుందని చెప్పిన సీఎం ఈ సందర్భంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. తమ ప్రభుత్వం విద్యా విధానాన్ని గాడిన పెడుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఏర్పాటు చేస్తున్న వివిధ రకాల స్కూళ్లు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ప్రీ ప్రైమరీ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్తానాన్ని వివరించారు. ఒకప్పుడు గ్యారెంటీలకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ మాట్లాడారనీ, అయితే ఇప్పుడు ఆయన పేరే ‘మోడీ గ్యారెంటీ’ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై గతంలో చెప్పిన అభిప్రాయాలనే మళ్లీ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్