43 శాతం భూభాగంలో వర్షాభావం
తెలంగాణలో 21 శాతం, ఏపీలో 43 శాతం వర్షపాతం లోటు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
న్యూఢిల్లీ: దేశంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న వేళ నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. సాధారణంగా సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే రుతుపవనాల నిష్క్రమణ ఈ ఏడాది నాలుగు రోజుల ఆలస్యంతో పశ్చిమ రాజస్తాన్ నుంచి మొదలైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 43 శాతం ప్రాంతం ఇప్పటికీ వర్షాభావాన్ని ఎదుర్కొంటుండగా.. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం
నైరుతి రుతుపవనాలు పశ్చిమ రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్టు ఐఎండీ ప్రకటించింది. రుతు పవనాల ఉపసంహరణ రేఖ రాజస్తాన్‌లోని రామ్ గఢ్, మోహన్‌గఢ్, ఫలోడీ, ఖాజువాలా ప్రాంతాల మీదుగా కొనసాగుతున్నట్టు తెలిపింది. రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, కచ్–సౌరాష్ట్ర ప్రాంతాల్లోని మరిన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని పేర్కొంది.
43 శాతం ప్రాంతంలో వర్షాభావం
ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 695.6 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 15 శాతం తక్కువ. జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటివరకు వర్షపాతం సాధారణ స్థాయికి దిగువనే కొనసాగింది. జులైలో మాత్రం సాధారణం కంటే ఒక శాతం అధిక వర్షపాతం నమోదైంది.
లోటు వర్షపాతంతో రాష్ట్రాలు విలవిల
పలు రాష్ట్రాల్లో గణనీయమైన లోటు వర్షపాతం నమోదైంది. మేఘాలయ(59 శాతం), ఏపీ(43 శాతం), అరుణాచల్‌ప్రదేశ్ (41 శాతం), బీహార్ (36 శాతం), గోవా (35 శాతం), కర్నాటక (31 శాతం), కేరళ (28 శాతం), అసోం (26 శాతం), తమిళనాడు (22 శాతం), హర్యానా (22 శాతం), తెలంగాణ (21 శాతం)లు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. రుతుపవనాల ఉపసంహరణ సమీపిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్, పంజాబ్‌లు ఈ సీజన్‌ను 21 నుంచి 40 శాతం వర్షపాతం లోటుతో ముగించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది
.
బంగాళాఖాతంలో అల్పపీడనం..
వాయుగుండంగా బలపడే అవకాశం
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 21 నాటికి వాయుగుండంగా, సెప్టెంబర్ 22 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 23న దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటి వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.
వచ్చే వారం భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వచ్చే వారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిం చింది. వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ.. వర్షపాతం లోటును పూర్తిగా భర్తీ చేస్తాయా అనేది వర్షాల తీవ్రత, విస్తృతి, వ్యవధిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వెనక్కి మళ్లుతున్న నైరుతి!
4 రోజుల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 21, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)