ఎవరైనా ఇష్టం లేక ఒక విషయాన్ని నిరాకరిస్తే వారి నిర్ణయాన్ని గౌరవించడం మంచి పద్ధతి. సినిమాల్లో చూపించినట్లుగా నిజ జీవితంలో ఉండదు. అమ్మాయి మనసులో నేను కావాలనుకుంటుంది, పైకి మాత్రం నో అని చెప్తుంది అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే. అమ్మాయి నో అంటే నిజంగానే నో అని అర్థం. అంతకు మించి దానికి భిన్నమైన అర్థాలు ఏమీ వుండదు. ఏ విషయంలో అయినా ఒకరు తమకు ఆసక్తి లేదు అన్నారంటే వారు మర్యాదగా నో అని చెబుతున్నారని అర్థం. ఆమె మాటకు విలువ ఇవ్వడం, ఆమె నిర్ణయాన్ని గౌరవిండం చాలా ముఖ్యం. వాస్తవానికి అదే నిజమైన ప్రేమ. నో చెప్పిన తర్వాత కూడా పదే పదే వెంటబడి, బలవంతం చేసి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. భార్యా భర్తల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆమె నుండి సమ్మతి తీసుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తే అనేక సమస్యలు వస్తాయి. ఆ సంసారం ఎక్కువ కాలం నిలబడదు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో చదవండి...
పల్లవికి దాదాపుగా 45 ఏండ్లు ఉంటాయి. వాళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. వాళ్ల పెండ్లి జరిగి 25 ఏండ్లు అవుతుంది. ఇద్దరూ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ బాగానే ఉంటారు. గొడవలు ఏమీ లేవు. అయితే పల్లవి భర్త రాహుల్ ఆమెతో పెద్దగా మాట్లాడడు. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడతాడు. అంతకు మించి పలకరించడు. పల్లవికి మాత్రం అతనితో సరదాగా కబుర్లు చెప్పాలని, భర్తతో కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్లాలని ఉంటుంది.
కానీ అతను మాత్రం కేవలం భార్యతో తన కోరిక తీర్చుకొని వెళ్లిపోతాడు. అసలు ఆమె ఇష్టాలేంటి, ఇబ్బందులేంటి అనేవి ఏమీ పట్టించుకోడు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోయినా అతనికి సంబంధం లేదు. తనకు ఇష్టం లేదన్నా పట్టించుకోడు. అసలు ఆమె అభిప్రాయానికి విలువే ఇవ్వడు. కొన్ని వీడియోలు చూపించి అలాగే చేయాలంటాడు. కేవలం తన శారీరక కోర్కెలు మాత్రం తీర్చుకుంటాడు. ఆమె మనసును అస్సలు పట్టించుకోడు. ఒక్కొక్కసారి ఇష్టం లేదంటే బలవంతం కూడా చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే కీ ఇచ్చిన బొమ్మలా, ఓ టీవీ రిమోట్‌లా భార్యను వాడుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐద్వా అదాలత్‌కు వచ్చిన ఆమె తన సమస్యకు పరిష్కారం చూపమంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
‘మేడమ్, నా భర్త దృష్టిలో నేనొక మనిషినే కాదు. కేవలం తన కోర్కెలు తీర్చుకునే యంత్రంలా నన్ను చూస్తున్నాడు. ఇలా ఎన్నేండ్లని ఉండాలి. నా వల్ల కావడం లేదు. నాకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అనే కదా! కానీ ఆయనకు ఎందుకు అర్థం కావడం లేదు.
అమ్మాయిలు కాదు అంటే అవును అనే భావన చాలా మందిలో ఉంది. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను. నేను చెప్పింది వింటే మీకు విచిత్రంగా అనిపించవచ్చు. ఇది కూడా ఓ సమస్యేనా అని మీరు అనుకోవచ్చు. కానీ నాకు అతను భర్తలా అనిపించడం లేదు. నాపైన రోజూ లైంగిక దాడి చేస్తున్నాడు. కానీ ఎవరికి చెప్పినా ఈ విషయం మామూలే కదా అనుకుంటారు. నాకేమీ అర్థం కావడం లేదు’ అన్నది.
దానికి మేము ‘నువ్వు పడుతున్న ఇబ్బంది మాకు అర్థమయింది. భర్త అయినంత మాత్రానా భార్యకు ఇష్టం లేకుండా చేయి వేయడాని హక్కు లేదు. దీన్నే వైవాహిక లైంగిక దాడి అంటారు. ఓ మహిళ నో అంటే నో అనే అర్థం. ఆమెకు ఇష్టం లేదు అంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. భార్య అంగీకారం లేకుండా ఆమెను బలవంతం చేస్తే అది చట్టరీత్యా నేరం. అలాగే ఏ మహిళతోనైనా, అమ్మాయితో అయినా ఇష్టం లేకుండా లైంగిక కోర్కెలు తీర్చుకుంటే అది నేరమే అవుతుంది. అలాగే భార్యకు కూడా ఇష్టం వుందో లేదో తెలుసుకోవాలి.
ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి. ఆమె మాటలకు విలువివ్వాలి’ అని చెప్పి రాహుల్‌కి ఫోన్ చేసి పిలిపించాము.
అతను వచ్చిన తర్వాత ‘రాహుల్ మీరు పల్లవి మాటలకు గౌరవం ఇవ్వాలి. ఆమె ఇష్టాఇష్టాలు దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టాను సారం ప్రవర్తిస్తున్నారు. భార్య అంటే ఆమెను ప్రేమించాలి, ఆమె మనసు ఏంటో అర్థం చేసుకోవాలి. ఆమెకూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. ఆమెకు నచ్చినట్టు ఉండటానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మీ అవసరాలు తీర్చుకొని వెళ్లిపోతే అది సంసారం కాదు. ఆమెతో కొంత సమయం గడపండి. ఆమె మనసు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.
భార్య అంటే కేవలం శారీరక కోర్కెలు తీర్చుకోవడానికి ఉందనుకుంటున్నారు. మీ ధోరణి అస్సలు సరైనది కాదు. భార్యా భర్తలంటే ఇద్దరి మధ్య ప్రేమా, అప్యాయత, అనురాగం, నమ్మకం ఉండాలి. అప్పుడే మీ సంసారం, కుటుంబం హాయిగా ఉంటుంది. ఆమెను ఓ యంత్రంలా కాకుండా ఓ మనిషిగా గుర్తించండి. లేదంటే దీని ప్రభావం మీ భవిష్యత్తుపై పడుతుంది.
భార్య కాబట్టి నా ఇష్టం, నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటే కుదరదు. ఆమె ఇష్టం లేకుండా తాకితే అది కూడా నేరమో అవుతుంది. నేరాలు, తప్పులు, కోర్టులు, చట్టాలు కాదు.. ముందు మీరు మీ భార్యను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే భవిష్యత్తులో మీరు చాలా కోల్పోవలసి వస్తుంది. ఇన్నేండ్లు మీపై అభిమానంతో మీరేం చేసినా మీ భార్య భరించింది. ఇకపై ఆమె భరించడానికి సిద్ధంగా లేదు. ఆమె మీ నుండి ప్రేమ కోరుకుంటుంది. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి, పల్లవి మనసు తెలుసుకోండి. అమె అభిప్రాయాలు గౌరవించండి. అప్పుడే మీకు నిజమైన సంతోషం’ అని చెప్పి పంపించాము.
- వై వరలక్ష్మి, 9948794051
ఇష్టం లేదంటే.. లేదనే..
4 గంటల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 25, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)