సీఎం ప్రజావాణి రాష్ట్రస్థాయి ఇన్‌చార్జీ గద్వాల్ విజయలక్ష్మి
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మెన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు 186 మంది ఎంపికయ్యారనీ, నియామక ప్రక్రియను ఆలస్యం చేయొద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి రాష్ట్రస్థాయి ఇన్‌చార్జీ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. నియామక పత్రాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ మేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మెన్ శ్రీనివాస్ రావుతో ఆమె ఫోన్‌లో సంప్రదించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో 257వ సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ సూపర్‌వైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వచ్చి వారి సమస్యను గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తెచ్చారు.
ఎంపిక ప్రక్రియ పూర్తై, ఫలితాలు మే నెలలోనే ప్రకటించారని వివరించారు. ఇప్పటివరకు నియామక ఉత్తర్వులు అందకపోవడంతో తీవ్ర అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అభ్యర్థులు వాపోయారు. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో కొంతమంది ఇతర ప్రయివేట్ ఉద్యోగావకాశాలను కూడా వదులుకున్నట్టు వివరించారు. అభ్యర్థుల విజ్ఞప్తిపై స్పందించిన గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులు మరింతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా, మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనీ, వారం రోజుల్లో నియామక పత్రాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాకుండా, వారి కుటుంబాల జీవనోపాధి, ఆర్థిక భద్రతతో ముడిపడి ఉన్న అంశమని వివరించారు. అందుకే ఈ సమస్యను మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమస్యను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చొరవ చూపిన గద్వాల్ విజయలక్ష్మికి అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ సూపర్‌వైజర్ అభ్యర్థులకు వారంలో నియామకపత్రాలు
3 రోజుల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)