Magazines

కెమికల్ పరిశ్రమలను వెంటనే మూసేయాలి

2 గంటల క్రితం

pollution.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 2 నిమిషాల చదవడం

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యులు ఎండీ జహంగీర్ డిమాండ్
11 కి.మీ. పాదయాత్ర

ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా
15 రోజుల్లో పరిహారం అందేలా చర్యలు: ఆర్డీవో హామీ

కాలుష్యంతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి


నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/
చౌటుప్పల్/భూదాన్‌‌పోచంపల్లి ​​
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల పరిధిలో కొనసాగుతున్న కెమికల్ పరిశ్రమలను తక్షణమే మూసేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. పరిశ్రమల కాలుష్యంతో నష్టపోయిన రైతాంగానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని కోరారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం భూదాన్‌‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం నుంచి ప్రజలు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు 11 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషపూరిత వాయువులు, పొగ, రసాయన వ్యర్థాలతో గాలి, నీరు కలుషితమవుతున్నాయని తెలిపారు. కాలుష్యం కారణంగా వ్యవసాయ భూములు, పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో 12 రకాల ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. 2019 నాటి కమిటీ సూచనల మేరకు కాలుష్యంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.52 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు 2021లో కలెక్టర్ కార్యాలయంలో జమ చేసిన రూ.23 లక్షల పంట నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు పంపిణీ చేయాలని కోరారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే రీ-సర్వే నిర్వహించి బాధిత రైతులందరినీ గుర్తించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ​ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ​సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. కలుషితమైన భూగర్భ జలాలు, చెరువులు, బోరుబావులను శాస్త్రీయంగా పరీక్షించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతమ్మగూడెం, దోతిగూడెం ప్రజలకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి సమగ్ర ఆరోగ్య సర్వే చేపట్టాలన్నారు. అనంతరం 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవో వెల్మ శేఖర్‌రెడ్డికి అందజేశారు.


15 రోజుల్లో పరిహారం అందేలా చర్యలు : ఆర్డీవో వెల్మ శేఖర్‌రెడ్డి

​ధర్నాలో పాల్గొన్న బాధితులను ఉద్దేశించి ఆర్డీవో వెల్మ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నష్టపరిహారం అందేలా 15 రోజుల్లో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసేందుకు రీ-సర్వే నిర్వహిస్తామని తెలిపారు. మిగిలిన సమస్యలను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారు. ​పోచంపల్లి మండల కార్యదర్శివర్గ సభ్యులు ప్రసాదం విష్ణు అధ్యక్షతన నిర్వహించిన ఈ దర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, రెండు గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్