Magazines

మద్దతుకు మించి ధర

2 గంటల క్రితం

Price above the support level
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 3 నిమిషాల చదవడం

రైతులు జాగ్రత్త పడితే మరింత పెరిగే అవకాశం
కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ఇంకా సిద్ధం కాని ప్రభుత్వం
వర్ని ఏరియాలో నేరుగా పచ్చివడ్లు సైతం తూకం

మొక్కజొన్న కొనుగోలుకు వ్యాపారుల మొగ్గు


నవతెలంగాణ-నిజామాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి
వర్షాకాలం సీజన్‌‌లో ఎల్‌‌నినో ఎఫెక్ట్‌‌తో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. రబీలో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సాగు రంగంపై తీవ్ర ప్రభావం చూపనుండగా.. క్రాప్‌ ‌హాలిడే ప్రకటించే సూచనలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం సాగవుతున్న పంట ఉత్పత్తుల కొనుగోలుపై వ్యాపారులు దృష్టి సారించారు. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసేందుకు సిద్ధం అవుతు న్నారు. ఇందుకోసం నేరుగా గ్రామాలకు వెళ్తూ పంటను సేకరించే పనుల్లో పడ్డారు. దీంతో మద్దతు ధరకు మించి చెల్లించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మొక్క జొన్న చేతికి రాగా మద్దతు ధర రూ.2410 ఉండగా.. అంతకు మించి చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌డివిజన్‌‌లో కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా నుంచి సైతం వ్యాపారులు వస్తుండటం గమనార్హం. దీంతో పాటు వర్ని, బాన్సువాడ ఏరియాలో వరి కోతకు రాగా.. కోసింది కోసినట్టే పచ్చి వడ్లనే కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ప్రస్తుతం వరికి రూ.2460 మద్దతు ధర ఉండగా రూ.3100 సైతం వెచ్చించి తూకం వేస్తున్నారు. రైతులు కొంత జాగ్రత్త పడి వేచి చూస్తే మరింత ధర వచ్చే అవకాశాలుంటాయని అధికారులు పేర్కొంటు న్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం ఇంకా ప్రభుత్వం సన్నద్దత కాకపోవడం గమనార్హం. వరి, పత్తి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మొక్కజొన్న పంట సాగవుతుంటుంది. ప్రస్తుత సీజన్‌‌లో 5,78,312 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా..


పలుచోట్ల కోతలు ప్రారంభ మయ్యాయి. నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌డివిజన్‌‌లో ఇప్పటికే కోతలు ప్రారంభమై ఆరబెడుతుండగా.. కామారెడ్డిలో కొంత ఆలస్యంగా వేస్తుండటంతో మరో 10-12 రోజుల్లో కోతకు రానుంది. సరిపడా నీళ్లు లేక ఎకరాకు 25-30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం 20-25 వరకు వచ్చినట్టు రైతులు పేర్కొంటున్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2410 ప్రకటించగా ప్రస్తుతం వ్యాపారులు నేరుగా వచ్చి మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రబీలో పంట చేతికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇప్పుడే పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మద్దతు ధరకు మించి రూ.2450 నుంచి రూ.2500 వరకు చెల్లిస్తున్నారు. వరంగల్‌ ‌జిల్లాలో అయితే ఏకంగా రూ.2900 చెల్లిస్తున్నట్టు సమాచారం. వాతావరణం సైతం అనుకూలంగా ఉందని, రైతులు కొంత ఆలస్యంగా విక్రయిస్తే ధర మరింత పెంచి ఇచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా మార్క్ ఫెడ్‌ ‌నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. పచ్చి వడ్లు సైతం తూకం నిజామాబాద్‌ ‌జిల్లాలో వర్ని, బాన్సువాడ, బోధన్‌ ఏరియాలో వరి ముందస్తు నాట్లు వేస్తుండటంతో ముంద స్తుగానే వడ్లు కోతకు వస్తాయి. ఇక్కడ పండించే సన్నరకం వడ్లకు డిమాండ్‌ ‌ఉంటుంది. వర్షాకాలంలో పండించే వరికి ఎక్కువ పోటీ ఉంటుంది. కోసిన వెంటనే పచ్చివడ్లను సైతం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌‌లో సన్నబియ్యం ధరలు అమాంతంగా పెరగడం, మరో వైపు రబీలో వరి సాగుపై అనిశ్చితి నెలకొనడంతో వ్యాపారులు సైతం ప్రస్తుత పంటను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేఎన్‌ఎం-1638 రకం వడ్లకు రూ.3100 చెల్లిస్తుండటం గమనార్హం.


​మేం ఏం చేసినా ఏం సాగుతది?

మక్కలు కొనేందుకు వ్యాపారు లే వస్తున్నారు. రోడ్ల మీద ఎన్ని రోజులని ఆరబెడతాం. ఎవరికైనా ఇబ్బందే. ఒక్క వర్షం పడి తడిచినా బూజు పట్టి పుల్లగ వాసన వస్తది. ఇప్పుడైతే ఎండలు కొడుతుండటంతో ఎండింది. లేకుంటే కష్టమే అవుతుండే. ఇగ ప్రభుత్వ కాంటాలు ఎప్పుడు పెడతరో తెలవదు. మేం రైతులం. ఏం చేసినా మాది ఏం సాగుతది. ఏం చేసినా నడుస్తలే. ప్రయివేటొల్లు వచ్చి రూ.2400 ఇస్తుర్రని అంటున్రు. ఇగ వాళ్లకే ఇస్తం.
కల్లెడ బొర్రన్న,జాగిర్యాల్‌,
 భీంగల్‌, నిజామాబాద్‌ జిల్లా

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్