ఫాసిస్ట్ దాడులు, కార్పొరేట్ దోపిడీని తిప్పికొడతాం : ఏఐకేఎమ్‌ఎస్ జాతీయ అధ్యక్షులు నిర్భయ్ సింగ్ దుడికే, ప్రధాన కార్యదర్శి జేవీ చలపతి రావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారానే ఆర్‌ఎస్‌ఎస్ -బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు సాగిస్తున్న ఫాసిస్టు దాడులను, కార్పొరేట్ దోపిడీని, భూస్వాముల అణచివేత ను సమర్థవంతంగా తిప్పికొట్టగలమని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎమ్‌ఎస్) నూతన అధ్యక్షులు కామ్రేడ్ నిర్భయ్ సింగ్ దుడికే, జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జేవీ చలపతి రావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని కామ్రేడ్ అజ్మీర్ సింగ్ హాల్ (ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్)లో మూడు రోజుల పాటు నిర్వహించిన మహాసభలు ముగిసిన అనంతరం గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవనాధార భూమి, అడవులు, నదులను కాపాడుకోవడానికి భూమిలేనివారు, వ్యవసాయ కార్మికులు, చిన్న, మధ్యతరహా రైతులను ఏకం చేసి పోరాటాలు నిర్మించాలని సూచించారు. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, ఆహార శుద్ధి, నిల్వ, మార్కెటింగ్ రంగాల నుంచి దేశీయ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ సంస్థలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయల రైతు పోరాటాల ప్రాముఖ్యతను పున రుద్ధరించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. రైతుల పోరాట ఐక్య వేదికగా ఎస్‌కేఎం సాధించిన పురోగతిని ప్రశంసిస్తూనే, ప్రభుత్వం వరి ధాన్యానికి కేవలం 3 శాతం, గోధుమలకు ఒక శాతం కంటే తక్కువ ధరకు మాత్రమే మద్దతు ధర పెంచడాన్ని ఆరోపించారు. రైతు-కూలీల ఐక్యతకు ప్రతీకగా ఎరుపు రంగు నేపథ్యంలో ఆకుపచ్చ పట్టీ, నాగలి, కొడవలి చిహ్నాలతో కూడిన నూతన జెండాను మహాసభ ఆమోదించిందని వెల్లడించారు.
నూతన జాతీయ కమిటీ ఎన్నిక
మహాసభలో నూతన జాతీయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐకేఎమ్‌ఎస్ జాతీయ అధ్యక్షునిగా నిర్భయ్ సింగ్ దుడికే, జాతీయ ప్రధాన కార్యదర్శిగా జేవీ చలపతి రావు ఎన్నికయ్యారు. జాతీయ ఉపాధ్యక్షులుగా అశిష్ మిట్టల్, టి. సుధాకర్, కార్యదర్శులుగా బాలచంద్ర, రమీందర్ సింగ్, కోశాధి కారిగా చిట్టిపాల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా వి.వెంకట్రామయ్య, గౌనీ ఐలయ్య, సుశాంతో ఝా, దేబాజిత్ చౌదరి, శంభు ప్రసాద్, ధరంపాల్ సింగ్, జెడ్‌పీఎస్‌సీ ప్రతినిధిగా ముఖేష్ మలౌత్‌తో పాటు పలువురిని నూతనంగా ఎన్నికయ్యారు.
తీర్మానాలు ఆమోదం
మహాసభలో ఆమోదించిన 17 తీర్మానాలను అమోదిం చినట్టు అధ్యక్షకార్యదర్శులు తెలిపారు. పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించడం, కరువు, వరదల శాస్త్రీయ నిర్వహణకు మద్దతు ఇవ్వడం, కెన్-బెట్వా నదుల అనుసంధానాన్ని నిలిపివేయడం వంటి అంశాలపై తీర్మానాలు చేసినట్టు చెప్పారు. నదీతీర ప్రాంతాల సూత్రం ఆధారంగా రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ సమస్యలను పరిష్కరించాలని, అమెరికాతో సహా ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ-20 పెట్రోల్ తయారీ కోసం ఆహార ధాన్యాల నుండి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడాన్ని ఖండిస్తున్నామని, కనీస మద్దతు ధర అమలు చేయాలని తీర్మానించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని, ఆత్మహత్యలను నివారించాలని తెలిపారు. గల్ఫ్, గాజా, ఉక్రెయిన్ వంటి ప్రాంతాల్లో యుద్ధాలను ఖండిస్తున్నామని, ఉపా, ఎన్ఎస్ఏ వంటి నల్ల చట్టాలను రద్దు చేసి నిర్బంధంలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేయాలని కోరారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుండి తొలగించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.





కామెంట్‌లు (0)