రెండు సెషన్లలో 11,903 మంది అభ్యర్థులు హాజరు
టీజీ ఈసీఈటీ-2026 ఫలితాలు విడుదల
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
టీజీ-సెట్ 2026 పరీక్షలు సోమవారం ఓయూ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఓయూ వీసీ ప్రొ. కుమార్ ఈ పరీక్షలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు రెండు సెషన్లకు కలిపి 14,035 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 11,903 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 84.79గా నమోదైంది. మొదటి సెషన్‌లో 7,108 మందికి 6,057 మంది (85.21 శాతం), రెండో సెషన్‌లో 6,927 మందికి 5,846 మంది (84.39 శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ప్రతాప్‌రెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. వి. నిత్యానందరావు, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. జి. నరేష్‌రెడ్డి, ఓఎస్డీ ప్రొ. ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, టీజీ-సెట్ సభ్య కార్యదర్శి ప్రొ. బి. శ్రీనివాస్, డీన్–డెవలప్‌మెంట్ అండ్ యూజీసీ అఫైర్స్ ప్రొ. బి. లావణ్యతోపాటు ఓయూ డీన్లు, అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు పరీక్షలు ఓయూ అధికారులు, పరీక్షా సిబ్బంది, పరీక్షా కేంద్రాల అధికారులు, సహాయక సిబ్బంది సమన్వయంతో సజావుగా జరిగాయని టీజీ-సెట్ సభ్య కార్యదర్శి ప్రొ. బి. శ్రీనివాస్ తెలిపారు.
టీజీ ఈసీఈటీ (వర్కింగ్ ప్రొఫెషనల్స్)-2026 ఫలితాలు విడుదల
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఓయూ నిర్వహించిన టీజీ ఈసీఈటీ (వర్కింగ్ ప్రొఫెషనల్స్)-2026 ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం ఓయూ వీసీ, టీజీ ఈసీఈటీ (వర్కింగ్ ప్రొఫెషనల్స్)-2026 చైర్మెన్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం విడుదల చేశారు. సెప్టెంబర్ 20న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 345 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 303 మంది (87.83 శాతం) హాజరయ్యారు. వీరిలో 291 మంది అర్హత సాధించారు.పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం, సహకారం, నిరంతర ప్రోత్సాహం అందించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, నిపుణుల కమిటీ సభ్యులు, అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరీక్షా సిబ్బందికి కన్వీనర్ ప్రొఫెసర్ పైడిమర్రి చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
టీజీ-సెట్ పరీక్షలు ప్రారంభం
52 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)