వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ 365, ఔట్‌లుక్, టీమ్స్ సహా పలు కీలక సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు గంటలకు పైగా నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్ల ద్వారా పనిచేసే ఓపెన్‌ఎఐ, ఆంత్రోపిక్ ఎఐ సేవలు కూడా ప్రభావితమయ్యాయి. డౌన్‌డిటెక్టర్ నివేదికల ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఔట్‌లుక్ అంతరాయంపై 1,38,058 ఫిర్యాదులు అందాయి. సర్వర్లలో సురక్షిత కనెక్షన్లు ఏర్పాటు చేసే ఒక కీలక ప్రక్రియపై భారం పెరగడమే దీనికి ప్రధాన కారణమని మైక్రోసాఫ్ట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. పరిష్కారం కోసం కాన్ఫిగరేషన్ మార్పును సిద్ధం చేసి, కొన్ని సర్వర్లపై పరీక్షించిన తర్వాత విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌లో ఇటీవల చేసిన మార్పులను కూడా వెనక్కి తీసుకుని పరిశీలిస్తోంది. ప్రస్తుతం సేవలు క్రమంగా అందుతున్నాయని సంస్థ వెల్లడించింది. ఈ అంతరాయంతో ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ దెబ్బతిని, ఔట్‌లుక్ మెయిల్స్ యాక్సెస్ కష్టమైంది. కాపిలట్, టీమ్స్‌లోని క్యాలెండర్, మీటింగ్ షెడ్యూలింగ్‌తో పాటు ప్లానర్, టూ డు, డిఫెండర్, పవర్ బీఐ, షేర్‌పాయింట్ ఆన్‌లైన్, విండోస్ 365 సేవలూ నిలిచిపోయాయి. కొన్ని వారాల క్రితం అజ్యూర్ క్లౌడ్‌లో సమస్యలు తలెత్తిన తర్వాత మళ్లీ ఇలాంటి పెద్ద అంతరాయం రావడం టెక్ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)