Magazines

ప్రజాతీర్పును గౌరవించని నెతన్యాహూ

21 గంటల క్రితం

Netanyahu
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

ఓటమికి అరబ్ పార్టీలే కారణమని నిందలు

ఓట్లను దొంగిలించారంటూ నిరాధార ఆరోపణలు


టెల్ అవీవ్ : మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే ఆయన స్నేహితుడైన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాత్రం ఆ ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగి వారం రోజులు గడచినప్పటికీ ఓటమిని నెతన్యాహూ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన అధికారిక ఫలితాలను ఆయన సవాలు చేస్తున్నారు. అరబ్ పార్టీలు, విదేశీ శక్తులు ఓట్లను దొంగిలించాయని ఆరోపిస్తున్నారు. అయితే తన ఆరోపణలకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలు చూపడం లేదు. అరబ్ పార్టీల నేతలపై విచారణ జరపాలని షిన్ బెట్ ఆంతరంగిక భద్రతా సంస్థ అధిపతి, నెతన్యాహూ విధేయుడు అయిన డేవిడ్ జానీ ఒత్తిడి చేస్తుండడంతో వివాదం మరింత ముదిరింది. ఇజ్రాయిల్ మితవాదులకు చాలా కాలంగా లక్ష్యంగా ఉన్న అటార్నీ జనరల్ మాత్రం ఆధారాలు లేకుండా విచారణకు అంగీకరించలేనని తేల్చి చెప్పారు.

మారణహోమానికి ప్రయత్నాలు : ఐసెన్‌కోట్

నెతన్యాహూ, ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధమైన పాలనకు వ్యతిరేకంగా మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ ఆరోపించారు. నెతన్యాహూ మాత్రం తన మొండి వైఖరిని వీడడం లేదు. ఇజ్రాయిల్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి విదేశీ శక్తులు పెద్ద మొత్తంలో సొమ్మును వెచ్చించాయని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అధికారిక ఫలితాల ప్రకారం ఇజ్రాయిల్ పార్లమెంటులో నెతన్యాహూ నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు రాగా ప్రతిపక్షాలకు 67 సీట్లు వచ్చాయి. వీటిలో అరబ్ పార్టీలైన జాయింట్ లిస్ట్, రామ్ 19 స్థానాలు గెలుచుకొని కింగ్ మేకర్‌గా అవతరించాయి.

అరబ్ పార్టీల చట్టబద్ధతను దెబ్బతీసే ప్రయత్నం

నెతన్యాహూను తొలగించడానికి ప్రతిపక్షం జరిపే ఏ ప్రయత్నానికైనా అరబ్ పార్టీల మద్దతు తప్పనిసరి. అందుకే వారి చట్టబద్ధతను దెబ్బతీయడానికి నెతన్యాహూ కూటమి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆ పార్టీలపై నెతన్యాహూ, ఆయన మితవాద మిత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అరబ్ పార్టీలు లంచాలు, విదేశీ నిధులు, మోసాల ద్వారా ఓట్లను దొంగిలించాయని ధ్వజమెత్తారు. ఓటింగ్ జరిగిన మరునాడే లికుడ్ పార్టీ ఈ ఆరోపణలకు తెర తీసింది. అరబ్ పార్టీల వ్యవహారంపై విచారణ జరపాలని, ఆ పార్టీల నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వందలాది అభ్యర్థనలు సమర్పించింది.


నెతన్యాహూకు ఏది దారి ?
పార్లమెంటులో ఉన్న మెజారిటీని ఉపయోగించుకొని ప్రస్తుత స్పీకర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఇజ్రాయిల్ ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏదేమైనా ఇజ్రాయిల్‌లో రాబోయే వారాల్లో అసలైన రాజకీయ పరీక్ష ఎదురు కాబోతోంది. అరబ్ పార్టీలపై ఆధారపడడం చట్టవిరుద్ధమని నెతన్యాహూ తన మితవాద మిత్రపక్షాలను, ప్రతిపక్షంలోని ఫిరాయింపుదారులను ఒప్పించగలిగితే తనను పదవి నుంచి దింపేసేందుకు ఉన్న ఏకైక మార్గాన్ని ఆయన అడ్డుకోవచ్చు. అయితే ప్రతి పక్షాలన్నీ ఏకమై ఆయన ఎత్తుగడలను తిప్పికొట్టే అవకాశాలూ 
ఉన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్