Magazines

అబూదాబీలో త్రైపాక్షిక శాంతి చర్చలు

18 నిమిషాల క్రితం

Trilateral
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

అబూదాబీ : ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా, ఉక్రెయిన్‌, అమెరికా దేశాల అధికారులు, నేతలు అబూదాబీలో మంగళవారం చర్చలు ప్రారంభించారు. ఈ ఏడాది ఇప్పటికే జనవరి, ఫిబ్రవరిలో భద్రతా సంబంధమైన అంశాలపై చర్చలు జరిగాయి. ఇప్పుడు యూఏఈ రాజధానిలో మూడో రౌండ్‌ చర్చలు జరుగుతున్నాయని రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నోవాస్తీ తెలియజేసింది. కాగా ఈ చర్చల్లో సానుకూల పురోగతి, ఆశాజనక వాతావరణం కన్పిస్తున్నాయని తెలుస్తోంది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాలపై ఎవరికి నియంత్రణ ఉండాలనే అత్యంత క్లిష్టమైన అంశంపై రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు కొంత పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శిస్తున్నాయని అమెరికా అధికారులు చెప్పారు. ఈ చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించేందుకు నిజమైన అవకాశం లభించిందని అమెరికా భావిస్తోంది. అమెరికా తరఫున స్టీవ్‌ విట్‌కాఫ్‌, దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ ఈ భేటీలో పాల్గొంటున్నారు. రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్‌ సహాయకుడు వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ నేతృత్వం వహిస్తుండగా ఉక్రెయిన్‌ తరఫున విదేశీ నిఘా సంస్థ అధిపతి రుస్తెం ఉమెరోవ్‌ నాయకత్వంలోని బృందం హాజరైంది.

భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు జరగకుండా ఇరు దేశాలు భద్రతా సంబంధమైన ఆందోళనలను పరిష్కరించుకోవడం, కొత్త ఐరోపా భద్రతా వ్యవస్థను నిర్మించడంపై ఈ రెండు రోజుల సమావేశం దృష్టి సారిస్తోంది. అమెరికా, గల్ఫ్‌ దేశాలు చర్చలపై సానుకూలంగానే ఉన్నప్పటికీ ఐరోపా దేశాలు, కొందరు రక్షణ నిపుణలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమ భూభాగాలను వదులుకోవడానికి ఉక్రెయిన్‌ కానీ, వెనక్కి తగ్గడానికి రష్యా కానీ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ సంప్రదింపుల్లో తమ స్థానాన్ని సైనిక దళాలు బలోపేతం చేశాయని వ్యాఖ్యానించారు. ఘర్షణల్లో రష్యా రికార్డు స్థాయిలో నష్టాలను చవిచూస్తోందని చెప్పారు. అయితే ఈ వాదనను రష్యా తోసిపుచ్చింది. ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌లో మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించాలన్న బలమైన కోరిక ఇరు పక్షాల్లో కన్పిస్తోందని తెలిపారు. యుద్ధంలో రెండు దేశాలు చాలా అలసిపోయాయని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్