తెలంగాణలో వ్యవసాయ, ఇతర నిర్దిష్ట వర్గాల విద్యుత్ వినియోగదారులకు మాత్రమే సేవలందించేందుకు మూడో విద్యుత్ పంపిణీ సంస్థగా తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ (టిజిఆర్పిడిసిఎల్) ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవు తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమిటి? రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమా? లేక విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటీకరణకు అనుకూల మైన మార్పులు తీసుకొచ్చే ప్రక్రియలో ఇదొక భాగమా? ఇప్పటికే ఉన్న రెండు డిస్కంలను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయకుండా కొత్త సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలి.
ప్రస్తుతం ఉన్న డిస్కంలు ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడానికి సగటు బిల్లింగ్ రేటు, విద్యుత్ సరఫరా వ్యయం మధ్య వ్యత్యాసమే కారణమన్న ప్రభుత్వ వాదన పూర్తి వాస్తవాలను ప్రతిబింబిం చడం లేదు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఇతర వినియోగదారుల నుంచి బకాయిలు వసూలు కాకపోవడం, ప్రభుత్వం సబ్సిడీలు, ట్రూ-అప్ మొత్తాలను సకాలంలో చెల్లించకపోవడం ప్రధాన సమస్యలు. 2025 జూలై 25 నాటికి ప్రభుత్వాలు, వాటి శాఖల నుంచి రెండు డిస్కంలకు రావాల్సిన బకాయిలు రూ.45,398 కోట్లు. 2016-17 నుంచి 2021-22 వరకు ఆమోదించిన రూ.9,360.35 కోట్ల ట్రూ-అప్ మొత్తాలను కూడా ప్రభుత్వం పూర్తిగా చెల్లించలేదు.ఈ బకాయిలను వసూలు చేసి, ప్రభుత్వ బాధ్యతలను నెరవేర్చి, ప్రస్తుత డిస్కంలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా మూడో సంస్థను ఏర్పాటు చేయడం వెనుక ప్రయోజనం ఏమిటి? ఒకే విద్యుత్ రంగంలో మరో సంస్థను సృష్టించడం వల్ల పరిపాలనా వ్యవస్థ విస్తరిస్తుంది తప్ప ఆర్థిక సమస్యలు వాటంతట అవే పరిష్కారం కావు.
బకాయిల బదిలీతో మేలు జరుగుతుందా?
లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, హైదరాబాద్ వాటర్ బోర్డు, మిషన్ భగీరథ నుంచి రావాల్సిన రూ.35,982 కోట్ల బకాయిలను, టిజి జెన్కోకు చెల్లించాల్సిన రూ.26,950 కోట్లను కొత్త డిస్కంకు బదిలీ చేయాలని ప్రతిపాదించారు. అలాగే రూ.9,032 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలను కూడా బదిలీ చేయనున్నారు. కానీ ఈ సంస్థకు బదిలీ చేసే ఆస్తుల పుస్తక విలువ కేవలం రూ.4,929 కోట్లు మాత్రమే. మరోవైపు పాత రెండు డిస్కంల వద్ద రూ.46,947 కోట్ల రుణాలు మిగిలిపోతాయి. ఆస్తులతో పోలిస్తే భారీ రుణాలు, బకాయిల బాధ్యతలను కొత్త సంస్థపై మోపడం వెనుక ఆర్థిక ప్రయోజనమేమిటి? కొత్త డిస్కం అప్పులు తీర్చ లేకపోతే ఆ భారాన్ని ఎవరు భరిస్తారు? ప్రభుత్వం అదనపు నిధులు సమకూరుస్తుందా? లేక భవిష్య త్తులో విద్యుత్ ఛార్జీల రూపంలో వినియోగదారు లపై భారం మోపుతుందా? రూ.5 కోట్ల అధీకృత వాటా మూలధనంతో పెట్టుబడులకు అవసరమైన ఈక్విటీని, రుణ విశ్వసనీయతను ఎలా సాధిస్తారన్నది కూడా సమాధానం లేని ప్రశ్న.
ప్రైవేటీకరణకు మార్గం సుగమమా?
మూడో డిస్కం ఏర్పాటులో అత్యంత కీలకమైన అంశం విద్యుత్ పంపిణీ రంగ భవిష్యత్తు. లాభదాయకమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు ఒకవైపు, సబ్సిడీలపై ఆధారపడే వ్యవసాయ వినియోగదారులు మరోవైపు ఉండేలా పంపిణీ వ్యవస్థను విభజించడం వల్ల భవిష్యత్తులో ప్రైవేటు సంస్థలకు లాభదాయకమైన వినియోగదారులకు మాత్రమే విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుందా? వ్యవసాయ, ఇతర సబ్సిడీ ఆధారిత వినియోగదారుల బాధ్యతను ప్రభుత్వ డిస్కంలపై వదిలేసి, లాభాలు వచ్చే పంపిణీ వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానానికి ఇది ముందడుగా? విద్యుత్ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రైవేటీకరణ సంస్కరణలలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుం టున్నారా? ఈ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి.
సబ్సిడీ భారం ఎవరి మీద పడుతుంది?
ప్రభుత్వ అంచనాల ప్రకారం మొత్తం విద్యుత్ అవసరాల్లో టిజిఎస్పిడిసిఎల్కు 45 శాతం, టిజిఎన్పిడిసిఎల్కు 13 శాతం, కొత్త డిస్కంకు 42 శాతం కేటాయించనున్నారు. అత్యధిక సబ్సిడీ అవసరమయ్యే వ్యవసాయ వినియోగ దారులను కొత్త సంస్థ పరిధిలోకి తీసుకొస్తున్నప్పటికీ, క్రాస్ సబ్సిడీ ద్వారా ఆదాయం సమకూర్చే వినియోగదారులను దాని పరిధిలోకి తీసుకురావడం లేదు. దీనివల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారం పెరుగుతుంది. 2026-27లో వ్యవసాయ విద్యుత్ సేవా వ్యయం రూ.20,851 కోట్లుగా అంచనా వేయగా, ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ రూ.12,181.21 కోట్లు మాత్రమే. మిగిలిన వ్యయాన్ని ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం సబ్సిడీని సకాలంలో విడుదల చేయకపోతే కొత్త సంస్థ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. వ్యవసాయ అవసరాలు సీజన్లను బట్టి మారుతుండటంతో విద్యుత్ మిగులు, కొరత సమస్యలు కూడా తలెత్తవచ్చు. అవసరమైనప్పుడు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తే అదనపు వ్యయం ఏర్పడుతుంది. చివరకు ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా? ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వేస్తుందా? అలాగే కొత్త డిస్కంకు సుమారు 2వేల మంది సిబ్బంది అవసరమని ప్రతిపాదించారు. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో ఖాళీలు ఉండగా, మరో సంస్థకు సిబ్బందిని బదిలీ చేస్తే మిగిలిన సంస్థల పనితీరుపై ప్రభావం పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణకు అదనపు ఖర్చులు, ప్రయాణ భారం పెరుగుతాయి. ఒకే గ్రామంలో వేర్వేరు డిస్కంల సిబ్బంది వేర్వేరు వినియోగదారులకు సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో వ్యవసాయ భూములు నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మారితే కొత్త కనెక్షన్లు ఏ డిస్కం పరిధిలోకి వస్తాయన్నది కూడా స్పష్టం చేయాలి.
కొత్త ప్రయోగమెందుకు?
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలంటే కొత్త సంస్థ ఏర్పాటు చేయడం కంటే ప్రస్తుతం ఉన్న డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ప్రభుత్వ బకాయిలు వసూలు చేయడం, సబ్సిడీలు సకాలంలో చెల్లించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ముఖ్యం. మూడో డిస్కం వల్ల రైతులకు అదనంగా కలిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం నిర్దిష్టంగా వెల్లడించాలి. దాని వల్ల ఏర్పడే ఆర్థిక, పరిపాలనా భారాన్ని ఎవరు మోయాలో కూడా స్పష్టం చేయాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను మూడు సంస్థలుగా విభజించడం కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమేనా? లేక ప్రైవేటీకరణకు అనువైన పరిస్థితులు సృష్టించే విస్తృత సంస్కరణల్లో భాగమా? ప్రజలకు, ఉద్యోగులకు, రైతులకు నష్టం కలిగించే విధానాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తి వివరాలను బహిర్గతం చేయాలి. ప్రజాధనంతో నడిచే విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో అనవసరమైన కొత్త ప్రయోగాలకు బదులుగా ప్రస్తుత డిస్కంలను పటిష్టం చేయాలి. అందువల్ల టిజిఆర్పిడిసిఎల్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
మూడ్ శోభన్, 9949725951







కామెంట్లు (0)