దేశం సిఈసి జ్ఞానేష్ కుమార్ ఓట్ చోరీ కుట్రలు, ఎన్నికల కుతంత్రాలపై పోరాటాలతో అట్టుడికి పోతున్నది. ఆంద్ర ప్రదేశ్‌లో సిఈసితో పాటు ఎస్ఈసి అనిల్ చంద్ర పునేఠా కూడా వివాదాస్పదులై కూచున్నారు. స్థానిక ఎన్నికల సమరంలో నామినేషన్ రిగ్గింగ్ అనే కొత్తమాట పుట్టడానికి ఇక్కడ పాలన చేస్తున్న టీడీపీ కూటమి కారణమైందంటే ఎస్ఈసి అలసత్వం సుస్పష్టం. ఆఖరుకు చరిత్రలో లేనివిధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నామినేషన్ల ముగింపు తేదీని పొడగిం చేలా చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుతుంది. ఈ అధ్యాయం ఇంకా ముగిసిందని చెప్పలేము. ఎందుకంటే, అత్యున్నత న్యాయవ్యవస్థ ఆదేశాల తర్వాత కూడా మొక్కుబడిగా ఏదో పొడగింపు ప్రకటించి దౌర్జన్యాలు యథావిధిగా సాగించినట్టు కూటమి భాగస్వాములైన జనసేన నాయకులే మీడియా సాక్షిగా ప్రకటించిన పరిస్థితి.
పైగా ఇది మున్సిపాలిటీల ఘట్టమే గనక తర్వాత మండల, జిల్లా పరిషత్‌లు, ఆ పైన గ్రామ పంచాయతీల వరకూ వచ్చేసరికి ఏమవుతుంద నేది ఆందోళన కలిగిస్తున్న అంశమే. నిజానికి ఏపీ మరో బీహార్‌లా తయారైందేమిటని జాతీయ మీడియాలో చర్చ సాగుతున్నట్టు సమాచారం వ్యాపించడంతో పరిశీలకులు వాకబు చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టు దాడులు, లాక్కోవడాలు ఏమీలేవని కొట్టి పారేస్తున్నారు. కోర్టులను పక్కదోవ పట్టిస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. అధికార బలం, హంగు దర్పాలు, దానికితోడు ఎన్నికల యంత్రాంగం తోడ్పాటు వున్నందువల్ల తుది ఫలితం నిజంగా ఎలా వుంటుందో చూడవలసిందే గానీ ప్రస్తుత కల్లోల వాతావరణానికి ఇదో నిదర్శనంగా మాత్రం కనిపిస్తున్నదనేది నిజం.
సిఈసి ఉదంతంతో మార్పు?
స్థానికం అటుంచి జాతీయ సన్నివేశానికి వస్తే సిఈసి విషయంలోనూ చంద్రబాబు నాయుడు అలవాటైన పిల్లిమొగ్గలే వేశారు. సర్‌పైన, ఎన్నికల సంఘం(ఈసిఐ)పనితీరుపైన మొదట కాస్త విమర్శనాత్మకంగా మాట్లాడినట్టు కనిపించి వెంటనే పూర్తిగా కితాబులిచ్చేందుకు సిద్ధమైపోయారు. ఈసిఐ పేరిట అధికారుల ద్వారా విడుదలైన మొక్కుబడి ప్రకటనే సమస్యలన్నిటికీ సమాధానమన్నట్టు చెప్పేశారు. నిజానికి బీజేపీ నేతల కన్నా ముందే చంద్రబాబు జ్ఞానేశ్‌కు వంత పాడటం హాస్యాస్పదమే. తెలుగువారైన మాజీ బ్యాంకు అధికారి (ఇమ్మనేని శేషగిరిరావు) ఆర్టిఐ కింద అడిగిన ప్రశ్నకు జవాబుగా ఎన్నికల కమిషనర్లు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన మాట నిజమేనని, వాటిని సిఈసికే తిరిగి పరిశీలనార్థం పంపించామని జవాబు వచ్చింది. అంటే వారు అభ్యంతరం పెట్టడంపై కథనాలు నిజమని తేలడమే కాదు, దాన్ని స్వయంగా కేంద్రం సిఈసికి పంపినప్పుడు ‘సర్’ నిరంకుశంగా కుట్రపూరితంగా జరిగిన సంగతి విదితం కాదా? కానీ ఏదిఏమైనా మోడీకి విధేయత చాటుకోవడమే కీలకమని చంద్రబాబు భావించారు కాబట్టే వత్తాసుగా రంగంలోకి దిగిపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే జెన్‌జీ జంతర్ మంతర్ ఆందోళన సమయంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రారంభసభలో యువతను తప్పుపడుతూ మోడీ భజన చేశారు.
సిఈసిపై సమరం మొదలైన తర్వాత జెడియు, లోక్‌జన్‌శక్తి వంటిపార్టీల నాయకులు కొంతైనా గొంతు వినిపించారేమో గానీ టీడీపీ మాత్రం గట్టిగా సమర్థించడానికి హడావుడి పడటమే గాక పోరాడే వారిపైనే దాడి చేసింది. టీడీపీ, జనసేన సర్వ సంపూర్ణంగా బీజేపీ-ఎన్డీయేలకు వంతపాడుతూ మెప్పుకోసం పాకులాడినా తెలుగు రాష్ర్టాలలోనూ మొత్తం దక్షిణాదిలోనూమాత్రం బీజేపీకి సిఈసి చర్యలకూ సానుకూలత రాకపోవడం గమనార్హం. ఏపీలో రెండు ప్రధాన ప్రాంతీయ పాలక పార్టీలు టీడీపీ, వైసీపీలు బీజేపీ పట్ల ప్రత్యేకించి మోడీకి మద్దతు ప్రకటిస్తూనే వచ్చాయి. మతతత్వం వంటి విధానాల్లో దాటేశాయి గానీ లౌకిక పోరాటంలో పాల్గొనలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా స్థానిక పాలకపార్టీ అయిన కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకోవడం తప్ప మతరాజకీయాలు, రాష్టాల హక్కులపై దాడి, ఓట్ చోరీ వంటి విషయాలపై కేంద్రీకరించింది లేదు. ఇలాంటి సమయంలో సిఈసిపై దుమారం రేగడం వాతావరణం కొంత మార్చింది. సిఈసి నిమామకం విషయంలో తాము మద్దతునివ్వడం పొరబాటేనని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం జాతీయ చర్చకు దారితీసింది. వైసీపీ గతంలో దాదాపు అన్ని విషయాల్లోనూ మోడీ సర్కారుకు అను కూలంగానే ఓటేస్తూ వచ్చింది. అలాంటి పార్టీ ఒక్కసారిగా సిఈసి విషయంలో జరిగింది తప్పని చెప్పడం బీజేపీకి పెద్ద కుదుపుగా మారింది.
బీజేపీకి పగ్గాలు?
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతోనే అంతా మారిందనీ, ఆయన ఇండియా కూటమి వైపు వచ్చేస్తున్నారని కొందరు మీడియా వ్యాఖ్యాతలు చెబుతున్నది కూడా పాక్షికమే. ఎందుకంటే ఎన్నికల విషయంలో మొదటి నుంచి వైసీపీ భిన్నస్వరం వినిపిస్తున్నది. 2024లో తీర్పు తారుమారైందనే వాదనతో వారు ఈవిఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి వచ్చాయి, కేసులు కూడా వేశారు. కనక సిఈసిపై విమర్శలను జగన్ ఆహ్వానిం చడంలో ఆశ్యర్యమేమీ లేదు. కాకపోతే మీరు వైసీపిని కూడా ఆహ్వానిస్తారా కాంగ్రెస్ నేతలను అడిగినప్పుడు బీజేపీని గట్టిగా వ్యతిరేకించేవారికి ఎప్పుడూ తమ తలుపులు తీసేవున్నాయని వారు జవాబిచ్చారు. అయితే వైసీపీ మీడియాను నేతల మాటలను గమనిస్తే వారు కాంగ్రెస్‌పై తమ దాడిని ఏమాత్రం తగ్గించినట్టు కనిపించదు. పైగా జగన్ ఆ పార్టీపై తిరుగు బాటుతోనే రాజకీయం ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో పిసిసి అధ్యక్షురాలిగా వున్న సోదరి షర్మిలతోనూ ఆయనకు వ్యక్తిగత ఆస్తి తగాదాలు కూడా తీవ్రంగానే వున్నాయి. ఇక ఆయనకు బాగా దగ్గరగా వుండే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం ఆ పార్టీ కూడా తెలంగాణలో కాంగ్రెస్‌పైనే ప్రధానంగా పోరాటం తర్వాతనే బీజేపీ జాతీయ రాజకీయాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబునూ కలిపి మాట్టాడుతుంటారు. అవసర మైతే బీజేపీతో పట్టువిడుపులు చూపించడానికి అభ్యంతరం లేదన్నట్టు వారి నేతలు సంకేతాలిస్తుంటారు. కనక జగన్ సిఈసిపై తీసుకున్న వైఖరితో ఒక అంశం మాత్రమే.
అయితే అదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఈ మార్పు ప్రభావాన్ని విమర్శకులు పరిగణనలోకి తీసుకోవడానికి తగిన కారణముంది. మహిళా రిజర్వేషన్ ముసుగులో ఇష్టానుసారం ఏకపక్షంగా లోక్‌సభ స్థానాల పెంపు కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఇది ఇబ్బంది కలిగించవచ్చు. సీట్ల సంఖ్య తగ్గకపోతే మద్దతునిస్తామని గతంలో డిఎంకె, బీఆర్ఎస్, వైసీపీ వంటిపార్టీలు ప్రకటించాయి. నిజానికి తెలుగు పార్టీలు సీట్లు పెరుగుతాయని కొంత ఆనంద పడ్డాయి కూడా, టివికె విజయ్ విజయం తర్వాత డిఎంకె స్టాలిన్, నవీన్ పట్నాయక్ వంటివారు కూడా బీజేపీకి కొంత సుముఖత కనపర్చారు. సిఈసి ద్వారా సర్ విషయంలో జరిగిన కోట్ల ఓట్ల తొలగింపు కుట్ర బయటకు వచ్చాక విజయ్ ఈ ఆందోళనలో గొంతు కలిపారు. డిఎంకె కూడా సీట్ల పెంపుపై చర్చ జరగాలని ప్రతిపాదించింది. నవీన్ సూటిగానే తమ విముఖత వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసి చాలా కాలలమైనా ప్రోరోగ్ చేయకుండా అట్లిపెట్టి ఆదాటున జరిపించి సీట్లు పెంచేసుకుందామనుకున్న బీజేపీకి వీటివల్ల గొంతులో వేలక్కాయ పడినట్టయింది. సాంకేతికంగా ఇలా ప్రత్యేక సమావేశం తప్పుకాదని చెబుతూనే పునర్విభజనపై సంపూర్ణ చర్చ చేయడానకి జంకుతున్నట్టు కనిపిస్తుంది.
విశాల కృషి దిశలో...
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికి నాలుగుసార్లు చర్చకోసం మోడీకి లేఖ రాసినా స్పందించకుండా లోపాయికారీగా ఏదో నడిపిస్తున్నారు. మరోవైపున సభావ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఖర్గేనే సమయం ఇవ్వలేదని వింత ఆరోపణ చేశారు. సర్ అలా వుండగానే జనాభా లెక్కల మత లెక్కలు కలగాలపులగం చేస్తూ ప్రైవేటు వ్యక్తులను కూడా ఆ పనికి వినియోగించవచ్చునని ప్రకటించడంపై సీపీఐ(ఎం) కార్యదర్శి ఎంఎ బేబీ నేరుగా రాష్ట్రపతికే లేఖ రాశారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్ నిరసనలపై అణచివేత చర్చల గురించి ఆందోళన వెలిబుచ్చుతూ వ్యాఖ్యలు చేస్తే ఆయనకు ఐరాసలోని ఇరవై మంది నిపుణులు మద్దతు ప్రకటించారు. ఓట్చోరీ తర్వాత మోడీ పట్టు తగ్గిపోయిందని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే బాహాటంగానే వ్యాఖ్యానించడం యాదృచ్చికం కాదు.ఈ పూర్వరంగంలో రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ మంత్రులూ ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్లూ సర్కారును కూల్చే కుట్రల గురించి గగ్గోలు పెట్టడం చూస్తున్నాం. ఇంకోవైపున రాహుల్‌గాంధీ అధికారంలోకి రావడం కల్ల అని మోడీ, అమిత్‌షాలు పనిగట్టుకుని దాడి చేయడం కూడా అందులో భాగమే.
కాంగ్రెస్, గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ విశాల సమస్యలను దారితప్పించడం బీజేపీ వ్యూహం. సిజెపి, కాంగ్రెస్ ఇండియా వేదిక, లౌకిక ప్రాంతీయ పార్టీలూ, పౌర సంస్థలూ వేటికవే చూడటం గాక ప్రజాస్వామ్య లౌకిక భారతం కోసం విశాల కృషి సాగించడం కీలకమన్నది గుర్తుంచు కోవాలి. వాటిపై ఏదో పేరుతో దాడి చేయడంలో అంతర్గత పథకాలనూ గమనించాలి. ఉదాహరణకు విజయవాడ మేయర్‌గా ఎబి వెంకటేశ్వర రావును ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలపర్చడంపై వస్తున్న వికృత వ్యాఖ్యానాలు కొందరు అక్కసు వెల్లగక్కడం ఇలాంటిదే. ఇతరులు పార్టీలు మారినా మద్దతులు, మతలబులు మార్చినా సమస్యలేదు. వామపక్షాలూ విధానపరంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం జీర్ణించుకోలేకపోవడం విడ్డూరం. తెలంగాణలో కౌన్సిల్ ఎన్నికలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జాతీయ రాష్ర్ట నేపథ్యాలు గమనించకుండా సంకుచిత కోణాలతో దాడిచేస్తే చెల్లుబాటవు తుందనుకోవడం అజ్ఞానం మాత్రమే. సహాయం కోరితే దానిపైనా దుష్ర్చచారాలు చేసినవారు భంగపడటం అనివార్యమే. వాటిపైనా తుది నిర్ణయం వెలువడుతుంది. సందర్భాన్ని సమస్యనూ బట్టి లౌకిక ప్రజాస్వామిక శక్తులనూ, వ్యక్తులనూ కలుపుకొంటూ ముందుకు సాగడంలో కలిగిన సత్పలితాలేంటో తాజా పరిణామాలే చెబుతున్నాయి.
తెలకపల్లి రవి






కామెంట్లు (0)