మనిషి చేసిన తప్పుకు శిక్ష విధిం చాల్సిన న్యాయస్థానం, ఆ శిక్ష పేరుతో మనిషి ప్రాణాన్నే తీసుకుంటే అది ఎలాంటి న్యాయం? ఒక మతపరమైన ప్రదేశం పవిత్రతకు భంగం కలిగిందన్న ఆరోపణతో ఇద్దరు మనుషులకు మరణ శిక్ష విధించి అమలు చేయడం ఏ నాగరికతకు నిదర్శనం? బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అఖ్తర్ అనే ఇద్దరిని సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతంలో అక్టోబర్ 14న ఉరి తీశారు. వారిద్దరూ మసీదులో ముద్దు పెట్టుకున్నందుకే ఈ శిక్ష విధించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, అందుకు నిర్ధారిత ఆధారాలు లేవు. సౌదీ ప్రభుత్వం మాత్రం మసీదులో ‘అనైతిక చర్య’కు పాల్పడ్డారని పేర్కొంది. అసలు నేరమేమిటో, ఏ ఆధారాలతో మరణశిక్ష విధించారో వివరించలేదు. తీర్పు ప్రతులనూ బహిర్గతం చేయలేదు. ఇంతటి తీవ్రమైన శిక్ష అమలు చేయడానికి ముందు బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థ పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇక్కడ ప్రశ్న మసీదులో ఏం జరిగిందన్నది మాత్రమే కాదు.
ఒక వ్యక్తి చేసిన తప్పు ఎంత తీవ్రమైనదైనా, దానికి మరణమే పరిష్కారమా? మతపరమైన పవిత్రతకు భంగం కలిగిందన్న కారణంతో మనుషుల ప్రాణాలు తీసే అధికారం రాజ్యానికి ఎక్కడి నుంచి వస్తుంది? నేరం చేసినవారికి శిక్ష పడాలి. కానీ ఆ శిక్ష న్యాయబద్ధంగా, నేరానికి అనుగుణంగా ఉండాలి. విచారణలో పారదర్శకత, నిందితులకు న్యాయవాది సహాయం, తమ వాదన వినిపించే అవకాశం తప్పనిసరి. నేర తీవ్రతను బట్టి యావజ్జీవ కారాగార శిక్ష వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, ప్రాణాలు తీసే శిక్షను ఎందుకు ఎంచు కోవాలి? పైగా, మరణశిక్ష అమలైతే న్యాయంలో పొరపాటు జరిగిందని తర్వాత తేలినా సరిదిద్దలేం. సౌదీ అరేబియాలో అమలవుతున్న షరియా ఆధారిత న్యాయవ్యవస్థలోని ‘తాజిర్’ విధానం ఈ చర్చకు కేంద్ర బిందువు. షరియా ఒక్క వ్యక్తి రూపొందించిన శిక్షాస్మృతి కాదు. ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ బోధనలు, ఇస్లామిక్ న్యాయ సంప్రదాయాలు, వాటి వ్యాఖ్యానాల ఆధారంగా శతాబ్దాలపాటు అభివృద్ధి చెందిన వ్యవస్థ. ‘తాజిర్’ కింద నిర్దిష్ట శిక్ష ముందే నిర్ణయించని నేరాలకు న్యాయమూర్తి తన విచక్షణ మేరకు శిక్ష విధించవచ్చు. సౌదీ ప్రభుత్వం తాజా కేసులో ఈ విధానాన్నే ప్రస్తావించింది.
అయితే, నేరం ఏమిటో, సాక్ష్యాలేమిటో ప్రజలకు తెలియకుండా ఇంత తీవ్రమైన శిక్ష విధించడం న్యాయసూత్రాలకు ఎంతవరకు అనుగుణం? మతగ్రంథాల వ్యాఖ్యానానికి న్యాయవ్యవస్థలో ఇంత విస్తృత అధికారం ఇచ్చినప్పుడు, వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇదే అసలు ప్రశ్న.
సౌదీలో గతంలోనూ అమానవీయ శిక్షలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2015లో లైలా బింత్ అబ్దుల్ ముతల్లిబ్ బాసిమ్ అనే మయన్మార్ మహిళను తన భర్త కుమార్తెను లైంగికంగా వేధించి హత్య చేసిన కేసులో బహి రంగంగా శిరచ్ఛేదం చేశారు. 2011లో చేతబడి, మంత్రవిద్యకు పాల్పడిందన్న ఆరోపణపై అమీనాను కూడా మరణశిక్ష విధించారు. నేరాలు నిరూపితమైతే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. కానీ శిక్ష పేరుతో మనుషుల ప్రాణాలను బహిరంగంగా తీసే పద్ధతి నాగరిక సమాజం ఆమోదించదగినదేనా? మత విశ్వాసాలపై గౌరవం ఉండాలి. అదే సమయంలో విశ్వాసాల పేరుతో జరిగే ప్రతి చర్యను ప్రశ్నించే హక్కూ ఉండాలి.
మరణశిక్షలే కాదు, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రభుత్వాన్ని విమర్శించినవారికి కఠిన శిక్షలు, మహిళల హక్కు లపై పరిమితులు, విదేశీ కార్మికుల దోపిడీ వంటి సమస్యలపైనా సౌదీ అరేబియా మానవ హక్కుల సంస్థల విమర్శలను ఎదుర్కొంటోంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, 2025లో ఆ దేశం కనీసం 356 మందికి మరణశిక్ష అమలు చేసింది. వీరిలో శాంతియుతంగా అసమ్మతి వ్యక్తం చేసినవారితో పాటు, హింసాత్మక నేరాలు చేయని మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులుగా తేలినవారూ ఉన్నారు. ఈ గణాంకాలు శిక్షల తీవ్రత, న్యాయ ప్రక్రియ, మానవ హక్కుల పరిరక్షణపై పునరాలోచించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి.
ఇది విదేశాల్లో జరిగిన ఘటనగా మాత్రమే భావించి మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన భారత్‌లోనూ మతాన్ని రాజకీయ అధికారానికి ఆధారంగా మార్చే ధోరణులు పెరుగుతున్నాయి. దేశాన్ని ఒక హిందూరాష్ట్రంగా మార్చాలన్న భావన బలపడితే, రాజ్యాంగం కల్పించిన సమానత్వం, మత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కుల పరిస్థితి ఏమిటి? మెజారిటీ మత విశ్వాసాలే జాతీయతకు కొలమానంగా మారితే మైనారిటీల పౌర హక్కులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ఈ ప్రశ్నలు ఊహాజనితమైనవి కావు.
దేశంలో ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వాటి తీవ్రత అర్థమవుతుంది.‘సర్’ పేరుతో ఒక వర్గాన్ని ఉద్దేశించి ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణల్ని కొట్టిపారేయలేం! అందుకే హిందూ అయినా, ముస్లిం అయినా మతాధారిత రాజ్యం ఏర్పడితే రేపు ఏం జరుగుతుందో ఊహించడానికి సౌదీ ఉదంతమే ఒక హెచ్చరిక. మతాన్ని విశ్వసించే హక్కు ఎంత ముఖ్యమో, విశ్వసించకపోయే హక్కూ అంతే ముఖ్యం. మతం పేరుతో ప్రాణాలు తీసే రాజ్యమైనా, చట్టాల పేరుతో పౌరుల హక్కులను హరించే రాజ్యమైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదమే.
మతం రాజ్యమేలితే...?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026 | 3 నిమిషాల చదవడం





కామెంట్లు (0)