అక్రమ అరెస్టులు...నిర్బంధాలు...కాల్పులు
కస్టడీ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న ఇమ్మిగ్రెంట్లు
తూతూ మంత్రంగా విచారణలు
వాషింగ్టన్ : వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు తాజా గణాంకాలు అద్దం పడుతున్నాయి. అక్రమ వలసదారుల ఏరివేత పేరిట ఫెడరల్ ఏజెంట్లు అమానుషంగా ప్రవర్తిస్తూ కాల్పులకు తెగబడుతున్నారు. అరెస్టులు విపరీతంగా పెరిగిపోతు న్నాయి. గత సంవత్సరం ప్రారంభం నుంచి చూసుకుంటే వలసదారుల నిర్బంధం సుమారు 70 శాతం మేర పెరిగింది. మరోవైపు దేశ బహిష్కరణలు వేగవంతం అయ్యా యి. దారుణమైన విషయమేమంటే నిర్బంధ సమయంలో వలసదారుల మరణాల రేటు కోవిడ్ మహమ్మారి తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణల ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తానంటూ చెప్పిన ట్రంప్ తన మాటను నిజం చేస్తున్నారు. వలసదారుల అణచివేతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ విశ్లేషించింది. ఈ విశ్లేషణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి.
బలప్రయోగం సమర్ధనీయమేనట
కొంతమంది ఫెడరల్ అధికారులు అత్యుత్సాహంతో వలసదారులపై దాష్టీకం ప్రదర్శిస్తున్నారు. అరెస్టులు, ఆపరేషన్ల సమయంలో కార్ల అద్దాలను పగలగొట్టి మరీ ఇమ్మిగ్రెంట్లను బయటకు లాగి నిర్బంధిస్తున్నారు. అణచివేత తీవ్రమవుతున్న కొద్దీ వీరి వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. వలసదారులపై ప్రాణాంతకమైన బలప్రయోగానికి తెగబడుతు న్నారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విధినిర్వహణలో ఉన్న ఇమ్మిగ్రేషన్-కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్(ఐసీఈ), కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఏజెంట్లు 21 మందిపై కాల్పులు జరిపారు. వీరిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 13 మంది గాయపడ్డారు.
అధికారులపై వలసదారుల దాడులు పెరిగాయని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) పదే పదే ఆరోపిస్తుండగా దుందుడుకు వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఈ విభాగం అమెరికా సమాజాలను ప్రమాదంలో పడేస్తోందని వలసదారుల హక్కుల కార్యకర్తలు, కొంతమంది స్థానిక నేతలు మండిపడుతున్నారు. బలప్రయోగం సమర్ధనీయమేనని ఫెడరల్ అధికారులు వితండవాదం చేస్తున్నారు. వలసదారుల అరెస్టులు, వారిపై జరుగుతున్న కాల్పులపై తూతూ మంత్రంగా విచారణలు జరుగుతున్నాయి.
నిర్బంధ సమయంలోనే గాలిలో కలుస్తున్న ప్రాణాలు
దేశం నుంచి బలవంతంగా బయటికి పంపేస్తున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతోంది. ట్రంప్ ప్రభుత్వం 9,85,000 మందిని దేశ బహిష్కరణకు గురి చేసిందని డీహెచ్‌ఎస్ తెలిపింది. ఇటీవలి కాలంలో బషిష్కరణలు ఎక్కువయ్యాయని ఇటీవల ఐసీఈ విడుదల చేసిన ప్రాథమిక డేటా చెబుతోంది. అయితే బహిష్కరణలకు సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. జూన్ నాటికి ఐసీఈ అదుపులో సుమారు 66 వేల మంది వలసదారులు ఉన్నారు. ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న నిర్బంధితుల సంఖ్యతో పోలిస్తే ఇది సుమారు 70 శాతం అధికం. ఓ వైపు నిర్బంధాలు పెరుగుతుంటే నిర్బంధాల సమయంలో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐసీఈ కస్టడీలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్బంధ సమయంలో వలసదారులు అనారోగ్యానికి గురవడం, వారికి సరైన వైద్య చికిత్స అందించ కపోవడం జరుగుతోంది. పెరుగుతున్న మరణాలకు వైద్యుల నిర్లక్ష్యం, అధ్వాన్నమైన పరిస్థితులే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా మరణాల సంఖ్య రెట్టింపు అయిందని కొందరు మానవ హక్కుల సంఘాల వైద్యులు తెలిపారు. మరిన్ని మరణాలు సంభవించకుండా అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆ సంఘాలు కోరుతున్నాయి.
నేర చరిత్ర లేకపోయినా నిర్బంధాలు
వలసదారులపై దాష్టీకాలను ట్రంప్ ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్ధించుకుంటోంది. 'కరడుకట్టిన నేరస్థుల' పైనే అధికారులు దృష్టి సారిస్తున్నారని చెబుతోంది. అయితే ప్రభుత్వ రికార్డులలో వీరిలో చాలా మందిపై ఎలాంటి నేరారోపణలు లేకపోవడం గమనార్హం. అరెస్టయిన వారిలో సుమారు 70 శాతం మంది అమెరికాలో నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన వారు లేదా అభియోగాలు ఎదుర్కొంటున్న వారేనని డీహెచ్‌ఎస్ అంటోంది. దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తుంటే ఎవరికీ మినహాయింపులు ఉండవని అధ్యక్షభవనం అధికారి టామ్ హోమన్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ఆరోపణలు పెండింగులో ఉన్న వారిని కూడా అధికారులు నేరస్థుల జాబితాలో చేర్చేస్తున్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల వద్ద ఆంక్షలు పెరగడంతో అరెస్టుల బాధ్యత ఐసీఈపై పడింది. అయినా సీబీపీ అధికారులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.






కామెంట్‌లు (0)