చమురు ధరలు తగ్గనీయం
వ్యూహం మార్చిన ఇరాన్
టెహ్రాన్ : హార్ముజ్‌లో ప్రయాణించే నౌకలపై దాడుల కోసం ఇరాన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. చమురు ధరలను ఇప్పటి మాదిరిగానే అధికంగా ఉంచాలని, తద్వారా అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసివేసి దానిపై పట్టు సాధించింది. తన అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోంది. తన ఆంక్షలను ఉల్లంఘించి రాకపోకలు సాగిస్తున్న నౌకలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. ఇరాన్ నాయకత్వంలోని అత్యున్నత స్థాయిలో వ్యూహ రచన జరిగిందని అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) చిన్న చిన్న పడవల్లో గూఢచారులను పంపుతూ నౌకల రాకపోకలను గుర్తిస్తోంది. గత 48 గంటల కాలంలో ఐదు చమురు ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. దాడుల వేగం పెరిగిందని సముద్ర భద్రతా వర్గాలు తెలిపాయి. తాజా వ్యూహంలో భాగంగా ఇరాన్ తన కార్యకలాపాల పరిధిని హార్ముజ్‌ను దాటి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో పాటు సుదూర ప్రాంతాలలోని జలాలకు విస్తరించింది. ఇటీవలి కాలంలో ఖతార్, యూఏఈ తీర ప్రాంత జలాలు సహా హార్ముజ్‌కు ఆవల ఉన్న ప్రాంతాలలోని నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. అమెరికాలో మ ధ్యంతర ఎన్నికలకు ముందు చమురు ధరలను తగ్గించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. త్వరలోనే హార్ముజ్‌ను పూర్తిగా మూసేస్తామని ఇరాన్ అధికారి ఒకరు తెలిపారు.







కామెంట్లు (0)