అనుమతించిన ట్రంప్
వాషింగ్టన్ : బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన సెనెటర్ ఫ్లావియో బోల్సొనారో అరెస్ట్ భయంతో అమెరికా చేరుకున్నారా ? జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. అమెరికా వచ్చేందుకు బోల్సొనారోకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చారు. ట్రంప్ సలహాదారుడు ఒకరు ఈ విషయాన్ని సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలియజేశారు. తన పాస్‌పోర్టును అప్పగించేందుకు బోల్సొనారోకు 24 గంటల సమయం ఉన్నదన్న విషయం అమెరికా అధికారులకు తెలుసునని, పరాజయం పాలైన ఆయనకు అమెరికాలో ప్రవేశం కల్పిస్తారని ఆ సలహాదారు చెప్పారు. బోల్సొనారోకు, ఆయన కుటుంబ సభ్యులకు అమెరికా వీసాలు జారీ చేస్తోందని అధికారులు ఇదివరకే తెలిపారు. బ్రెజిల్లో ఉంటే అరెస్ట్ చేస్తారని బోల్సొనారో భయపడుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. అవినీతి, మనీలాండరింగ్, కరెన్సీ ఎగవేత ఆరోపణలపై ఆయనను ప్రస్తుతం బ్రెజిల్ సుప్రీంకోర్టు విచారిస్తోంది. కాగా బోల్సొనారో ఇప్పటికే అమెరికా చేరుకున్నారని కొన్ని వర్గాలు చెబుతున్నప్పటికీ దానిపై ఇంకా స్పష్టత లేదు.
బోల్సొనారో అమెరికా రావడానికి అనుమతిస్తానని ట్రంప్ చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ 'వారు మంచి వ్యక్తులని భావిస్తున్నాను. బ్రెజిల్లో ఎన్నికలు విచిత్రంగా జరిగాయి. అవి భయానకంగా ఉన్నాయని అనుకుంటున్నాను' అని వ్యాఖ్యానించారు. కాగా బోల్సొనారో బ్రెజిల్‌ను విడిచి అర్జెంటీనా మీదుగా అమెరికా చేరుకున్నారని అర్జెంటీనా వార్తా సంస్థ ఇన్ఫోబే తెలిపింది. అర్జెంటీనా కాలమానం ప్రకారం బోల్సొనారో, ఆయన కుటుంబం మంగళవారం రాత్రి బ్రెజిల్ నుంచి అర్జెంటీనాలో ప్రవేశించారని, ఆ తర్వాత కొద్దిసేపటికే ఈక్వెడార్‌లోని గ్వాయాక్విల్కు విమానం ఎక్కారని ఆ దేశపు వలసల మంత్రిత్వ శాఖ తెలియజేసింది.







కామెంట్లు (0)