కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశం అనంతరం అవినీతి వ్యతిరేక చర్యలు తీవ్రతరమయ్యాయి. ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో చైనాలో రికార్డు స్థాయిలో ఎనిమిది లక్షల అవినీతి కేసులు నమోదయ్యాయి. సుమారు 6.80,000 మంది అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సుమారు 73 మంది ప్రాంతీయ మంత్రిత్వ శాఖ స్థాయి ఉన్నతాధికారులపై దర్యాప్తు జరిపారు. ఇది గత మూడు సంవత్సరాల సగటు కంటే చాలా ఎక్కువ. భారీగా లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడుతున్న ఉన్నతాధికారులను కోర్టు తీర్పుల ద్వారా తీవ్రమైన శిక్షలకు గురి చేస్తూ కఠినమైన సంకేతాలు పంపుతున్నారు. చైనా రక్షణ విభాగంలో ఉన్నత స్థాయి అవినీతిని అంతమొందించడానికి సైనిక కమాండర్లపై జిన్పింగ్ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. అత్యున్నత రక్షణ సంస్థ సీఎంసీలో ఏడుగురు సభ్యులు ఉండగా వారిలో ఐదుగురిని పదవుల నుంచి తొలగించారు.
విదేశాలకు పరారైన అవినీతి అధికారులు, వ్యాపారవేత్తలను పట్టుకోవడానికి చైనా 'స్కైనెట్' అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. విదేశాల్లోని వారు సంపాదించిన అక్రమ ఆస్తులను రికవరీ చేయడం, నిధులను దాచుకోవడానికి ఉపయోగించే ఆఫ్షోర్ బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దీని ఉద్దేశం. చైనా అధికారులు కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే పరారీలో ఉన్న వెయ్యి మందికి పైగా నిందితులను స్వదేశానికి రప్పించి బిలియన్ డాలర్ల నిధులను వెనక్కి తెచ్చారు. అవినీతి సొమ్ముతో విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేయకుండా అడ్డుకోవడానికి ఓ చట్టాన్ని తీసుకొని వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అవినీతిపై పోరాటం కేవలం తాత్కాలిక చర్య కాదని, దానిని ఎప్పటికీ ముగిసిపోని నిరంతర ప్రక్రియగా మార్చాలని జిన్పింగ్ ఆదేశించారు.







కామెంట్లు (0)