Magazines

ట్రంప్‌ పోస్టుల కోసం వెంపర్లాట !

1 గంట క్రితం

administration
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రూత్‌ సోషల్‌తో ట్రేడింగ్‌ సంస్థల ఒప్పందం
సేవల విలువ నెలకు లక్ష డాలర్లు

ప్రకటనలు అమ్ముకోవడం అనైతికమంటున్న విశ్లేషకులు


న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో విరివిగా పోస్టులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. వీటిని త్వరగా అందుకునేందుకు బ్లూమ్‌బర్గ్‌తో పాటు రెండు వాల్‌స్ట్రీట్‌ సంస్థలు ట్రూత్‌ సోషల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రంప్‌ పెట్టే పోస్టులను అందరి కంటే ముందుగానే తీసుకునేందుకు ఈ సంస్థలు ట్రూత్‌ సోషల్‌కు నెలకు అక్షరాలా లక్ష డాలర్ల వరకూ చెల్లిస్తాయి. వాల్‌స్ట్రీట్‌కు చెందిన సస్క్వేహన్నా ఇంటర్నేషనల్‌ గ్రూప్‌, జంప్‌ ట్రేడింగ్‌లు హై-ఫ్రీక్వెనీ ట్రేడింగ్‌ సంస్థలు. న్యూస్‌-డేటా ప్రొవైడర్‌ బ్లూమ్‌బర్గ్‌తో పాటు ఈ రెండు సంస్థలు ట్రంప్‌ పోస్టులను సకాలంలో పొందుతాయి. తద్వారా వీటికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థిక మార్కెట్లలో హెచ్చుతగ్గులను సృష్టించే సత్తా ట్రూత్‌ సోషల్‌కు ఉంది. సాధారణ పెట్టుబడిదారులకు అందుబాటులో లేని అదనపు ప్రయోజనాన్ని ఇది వాల్‌స్ట్రీట్‌ ట్రేడర్లకు అందిస్తుంది.

ప్రకటనలు అమ్ముకుంటున్న ప్రసిడెంట్‌

పదవిలో కొనసాగుతున్న అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన వ్యాపార సంస్థ ఆయన ప్రకటనలను అమ్మడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. ఈ చర్యను కొందరు విమర్శకులు అనైతికమైనదిగా అభివర్ణించారు. ట్రంప్‌ పెట్టే సోషల్‌ మీడియా పోస్టులను సాధారణ వినియోగదారుల కంటే ముందుగానే తెలుసుకునేలా పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఫీడ్‌ను (ట్రూత్‌ ఏపీఐ) ట్రూత్‌ సోషల్‌ విక్రయిస్తోంది. ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేసే ట్రంప్‌ పోస్టులను కొన్ని మిల్లీసెకన్లకు ముందే అందుకోవడం కోసం వాల్‌స్ట్రీట్‌ ట్రేడింగ్‌ సంస్థలు భారీగా సొమ్ము చెల్లిస్తున్నాయి. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ (టీఎంటీజీ) ఈ ప్రత్యేక డేటా సేవను ప్రారంభించింది. దీని ద్వారా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న సంస్థలకు ట్రంప్‌ పోస్టులు సాధారణ ప్రజల కంటే దాదాపు యాభై మిల్లీసెకన్లు వేగంగా అందుతాయి. ఈ యాభై మిల్లీసెకన్ల సమయాన్ని ఉపయో గించుకొని ఆయా సంస్థలు మార్కెట్లో వేగంగా షేర్ల కొనుగోలు, అమ్మకాలు జరుపుతాయి.


అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావమే కారణం

ట్రంప్‌ పోస్టులను వేగవంతంగా పొందేందుకు ట్రేడింగ్‌ సంస్థలు నెలకు అరవై వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ చెల్లిస్తాయి. అంటే మన కరెన్సీలో 50 లక్షల రూపాయల నుంచి 84 లక్షల రూపాయల వరకూ ముట్ట చెబుతాయి. ట్రంప్‌ పోస్టులు గ్లోబల్‌ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి కనుకనే పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతోందని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదికలో పోస్ట్‌ పెట్టగానే చమురు మార్కెట్‌లో ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ఒక్కసారిగా పడిపోయాయి. కాగా అధికారంలో ఉన్న ఒక దేశ అధ్యక్షుడు తన సొంత ప్రకటనలను ప్రైవేటు లాభాల కోసం ఇలా విక్రయించడం చరిత్రలోనే మొదటిసారి అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇది సాధారణ పెట్టుబడిదారులకు నష్టం కలిగిస్తుందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డెమొక్రటిక్‌ సెనెటర్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)ని కోరారు. అధ్యక్ష పదవిని ట్రంప్‌ తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మీడియా, లీగల్‌ సంస్థలు విమర్శిస్తున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్