మరో విజయంపై కన్నేసిన అయ్యర్‌సేన
భారత్, న్యూజిలాండ్ నాల్గో టీ20 నేడు
మధ్యాహ్నాం 12.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
నవతెలంగాణ-ఆక్లాండ్
భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో మరో పరుగుల పండుగకు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్ ఈడెన్‌పార్క్‌లో స్ర్టయిట్ బౌండరీలు 59 మీటర్ల కంటే తక్కువగా ఉన్నాయి. చిన్న బౌండరీల ఈడెన్‌పార్క్‌లో ఇరగదీసేందుకు టీమ్ ఇండియా బ్యాటర్లు సై అంటున్నారు. సిరీస్‌పై ఆశలు ఆవిరైనా, ఆఖరు రెండింట విజయాలు సాధించాలనే తపన ఆతిథ్య జట్టులో కనిపిస్తోంది. భారత్, న్యూజిలాండ్ నాల్గో టీ20 పోరు నేడు.
వెల్లింగ్టన్ టీ20లో 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదేసిన టీమ్ ఇండియా నేడు ఆక్లాండ్‌లోనూ అదే తరహా విజయంపై గురి పెట్టింది. ఇక్కడ స్ర్టయిట్ బౌండరీలు చిన్నవి కావటంతో భారత బౌలర్లు వేగంగా వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. బౌలర్లకు ఇది సవాలే కానీ బ్యాటర్లకు మరో బ్యాటింగ్ స్వర్గధామం అని చెప్పవచ్చు. ఆతిథ్య న్యూజిలాండ్ బౌలింగ్ దళం గాయాలతో ఇబ్బంది పడటం ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. బౌలింగ్, ఫీల్డింగ్ మొహరింపులు ఇక్కడ సవాల్‌తో కూడుకున్నవి.
బెంచ్‌కు అవకాశం ఇస్తారా?
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లు సైతం ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, బెంచ్ ఆటగాళ్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గాయపడిన ఇషాన్ కిషన్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదు. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే శివం దూబె బరిలోకి దిగుతాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలో ఒకరు ఆడనున్నారు. పేసర్ అర్ష్‌దీప్ స్థానంలో మయాంక్ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తుందా? లేదంటే గెలుపు కాంబినేషన్‌ను కొనసాగిస్తుందా? చూడాలి. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ భారత్‌కు అతిపెద్ద అనుకూలత. పవర్‌ప్లేలో వికెట్‌కు రెండు వైపులా ఎదురుదాడి చేయగల ఓపెనర్లతో ప్రత్యర్థి బౌలర్లు డిఫెన్స్‌లో పడుతున్నారు. బంతి ఏమాత్రం గతి తప్పినా, స్టాండ్స్‌లో దర్శనమిస్తోంది. శ్రేయస్ అయ్యర్ లక్నో సెంచరీ అనంతరం మళ్లీ మెరవలేదు. ఎదురుదాడి చేసేందుకు, స్ర్టయిక్ రొటేషన్‌కు సైతం ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్‌తో అయ్యర్ ఆత్మవిశ్వాసం సాధించటం సైతం భారత్‌కు కీలకం. ఈ మ్యాచ్‌లో అయ్యర్ ఏం చేస్తాడో మరి.
కివీస్‌కు కష్టాలు
న్యూజిలాండ్‌కు గాయాల బెడద ఎక్కువైంది. మాట్ హెన్నీ, జాక్ ఫౌల్క్స్ తో పాటు లాకీ ఫెర్గుసన్ గాయపడిన పేసర్ల జాబితాలో చేరారు. మాట్ ఫిషర్, టిక్‌నర్‌లు జట్టులో చేరినా, అనుభవ లేమి ప్రతికూలం. బ్యాటింగ్ లైనప్‌లో డార్లీ మిచెల్ రాణించినా, నెమ్మదిగా ఆడటం ఆఖర్లో బౌండరీలు బాదేందుకు ఇబ్బంది పడటం కివీస్‌ను బలహీనపరుస్తున్నాయి. ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లు అంచనాలను అందుకుంటేనే భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల స్కోరు చేయటం న్యూజిలాండ్‌కు సాధ్యపడుతుంది. టిమ్ సీఫర్ట్, బెవాన్ జాకబ్స్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయటం లేదు. ఆడం మిల్నె, జాకబ్ డఫ్ఫీ, మాట్ ఫిషర్, నాథన్ స్మిత్‌లు పేస్ బాధ్యతలు తీసుకోనుండగా, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాయాజాలం భారం మోయనున్నాడు.
పిచ్, వాతావరణం
వెల్లింగ్టన్‌లో స్క్వేర్ బౌండరీలు చిన్నవి కాగా, ఆక్లాండ్ ఈడెన్ పార్క్‌లో స్ట్రయిట్ బౌండరీలు చాలా చిన్నవి. ఐసీసీ రూల్స్ ప్రకారం పిచ్ సెంటర్ నుంచి 59.43 మీటర్లు ఉండాలి. ఈడెన్‌పార్క్‌లో కనీస దూరం కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో మళ్లీ పరుగుల వరదకు అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. మ్యాచ్ సమయంలో ఆహ్లాదకర వాతావరణం ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్
యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ (వికెట్‌కీపర్), డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఆడం మిల్నె, జాకబ్ డఫ్ఫీ, మాట్ ఫిషర్, నాథన్ స్మిత్.







కామెంట్‌లు (0)