Magazines

ఇరాన్‌పై అణు రహిత బాంబు ప్రయోగం?

3 గంటల క్రితం

non-nuclear bomb
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 3 నిమిషాల చదవడం

సరికొత్త యుద్ధ ప్రణాళికలు రూపొందిస్తున్న అమెరికా సైన్యం
‘అన్ని బాంబులకు తల్లి’ ప్రభావంపై నిపుణుల సందేహాలు


వాషింగ్టన్ : మధ్యంతర ఎన్నికలకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ ఇరాన్‌పై యుద్ధ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే టెహ్రాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన అణు రహిత బాంబును ఉపయోగించాలని అమెరికా సైన్యం యోచిస్తోంది. ఈ బాంబును అమెరికాలో ‘అన్ని బాంబులకు తల్లి’ అని పిలుస్తారు. ఇరాన్‌పై దాడికి ఆదేశాలు వెలువడితే ఏం చేయాలనే దానిపై సైన్యం సరికొత్త ప్రణాళికలను కూడా రూపొందించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే అత్యంత శక్తివంతమైన అణు రహిత బాంబును మొదటిసారి ఇరాన్‌పై ప్రయోగిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పైగా ట్రంప్ చెబుతున్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనలో లేదా యుద్ధ గమనాన్ని మార్చడంలో ఈ బాంబు ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంపై సందేహాలు కూడా కలుగుతున్నాయి.

సాధించింది శూన్యం

ఇరాన్‌పై ఫిబ్రవరి చివరలో ఇజ్రాయిల్‌తో కలిసి ప్రారంభించిన యుద్ధం విషయంలో అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత కన్పిస్తోంది. త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి. ఆరు నెలలకు పైగా ఇరాన్‌పై బాంబు దాడులు జరుపుతున్నప్పటికీ అమెరికా ఆశించిన లక్ష్యాలేవీ నెరవేరలేదు. యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదు. అసలు యుద్ధాన్ని ముగించే వ్యూహం అధ్యక్షభవనం వద్ద ఉన్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో గెలుపు తమదేనని ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు చెబుతున్నా ట్రంప్ మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. ఇరాన్‌లో చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని ఆయన చెబుతున్నారు. దళాలను ఇరాన్ నుంచి వెనక్కి రప్పించాలని కొన్ని మిత్రదేశాలు సూచిస్తున ప్పటికీ అలా చేస్తే ఓటమిని అంగీకరించినట్లే అవుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

సామర్ధ్యంపై సందేహాలు

ఇరాన్ విషయంలో ఏం చేయాలనే దానిపై వైట్‌హౌస్ సలహాదారులు గత కొన్ని వారాలుగా చర్చోపచర్చలు జరుపుతున్నారు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఎలాంటి చర్యలు చేపట్టబోనని ట్రంప్ చెబుతున్నా దానిని విశ్వసించలేమని కొందరు సలహాదారులు అంటున్నారు. ఇరాన్‌లోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల కోసం ఓ ప్రణాళికను రూపొందించాలని, అణు రహిత బాంబు వినియోగం గురించి ఆలోచించాల్సిందిగా సైన్యాన్ని ట్రంప్ ఆదేశిం చారని సమాచారం. పికాక్ పర్వతంతో సహా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేయడానికి ఆ బాంబును ఉపయోగించాలని ట్రంప్ స్పష్టంగా చెప్పారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలు, భూమి లోపల చాలా లోతుగా ఉన్న స్థావరాలపై అణు రహిత బాంబును ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుందా అని కొందరు నిపుణులు ప్రశ్ని స్తున్నారు. ఈ బాంబు ఎంత శక్తివం తమైనది అయినప్పటికీ గ్రానైట్ పొరలతో పటిష్టంగా ఉన్న పికాక్ పర్వతంలోని అణు కర్మాగారాలను, అణు స్థావరాలను ధ్వంసం చేసేంత లోతుగా భూమిలోకి చొచ్చుకుపోయే సామర్ధ్యం దీనికి లేదని తెలుస్తోంది. దీని ప్రభావం భూ ఉపరితలంపై మాత్రమే ఉంటుందని కొందరు నిపుణులు తెలిపారు. అయితే ప్రాణనష్టం మాత్రం అధికంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


మానసిక యుద్ధం కోసమే...

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడంతో ఈ బాంబును ట్రంప్ ఓ బూచిగా చూపడానికి ప్రయత్నిస్తు న్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ బాంబును మోహరించినంత మాత్రాన ఇరాన్‌ను లొంగిపోయేలా చేయలేమని కొందరు అధికారులు స్పష్టం చేశారు. ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌’ అనేది ప్రధానంగా మానసిక యుద్ధం కోసం రూపొందించిన ఆయుధంగా భావించవచ్చునని కొందరు సైనికాధికా రులు చెప్పారు. ఇరాన్‌ను ఓడించాలంటే భూతల దాడులు తప్ప వేరే మార్గం లేదని కొందరు అంగీకరించారు. అయితే ఈ తరహా దాడులతో వేలాది మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.


విధ్వంసం సృష్టిస్తుంది

అత్యంత శక్తివంతమైన అణు రహిత బాంబు బరువు 9,800 కిలోలు. పొడవు 30 అడుగులు. దీనిలో సుమారు 8,480 కిలోల శక్తివంతమైన హెచ్ - 6 పేలుడు పదార్థం ఉంటుంది. దీని విధ్వంసక సామర్ధ్యం 11 టన్నుల టీఎన్‌టీ (లేత పసుపు రంగులో ఉండే రసాయన సమ్మేళనం) పేలుడుతో సమానం. ఈ బాంబు భూమిని తాకడానికి ముందే గాలిలో పేలిపోతుంది. దీనివల్ల ఏర్పడే తీవ్రమైన వాయు పీడన తరంగాలు (షాక్ వేవ్స్) భూగర్భంలోని గుహలు, సొరంగాలు, బంకర్లను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. ప్రయోగించిన తర్వాత ఈ బాంబు కచ్చి తంగా లక్ష్యాన్ని తాకుతుంది. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ అనుకున్న చోట పేలుతుంది. ఇది చాలా పెద్దది కావడంతో ప్రయోగం కోసం సీ - 130 హెర్క్యులస్ అనే భారీ రవాణా విమానాన్ని ఉపయోగిస్తారు. విమానం వెనుక భాగం నుంచి పారాచూట్ సాయంతో బాంబును బయటికి లాగుతారు. ఆ తర్వాత అది లక్ష్యం వైపు దూసుకుపోతుంది. ఈ బాంబు పేలితే సుమారు 1.6 కిలోమీటర్ల వ్యాసార్థం వరకూ ఉన్న ప్రతి దానినీ బూడిద చేస్తుంది. దీని ద్వారా వచ్చే షాక్ వేవ్స్ అనేక కిలోమీటర్ల దూరంలోని భవనాలను సైతం దెబ్బతీస్తాయి. అమెరికా ఆయుధాగారంలో ఉన్న ఈ జీబీయూ - 43/బీ బాంబును 2003లోనే తయారు చేశారు. అయితే మొదటి సారిగా 2017లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదుల గుహలపై ప్రయోగించింది. ఈ దాడిలో సుమారు 90 మంది మరణిం చారని, ఐసీస్ నెట్‌వర్క్ పూర్తిగా ధ్వంసమైందని నివేదికలు చెబుతున్నాయి. రష్యా దీని కంటే శక్తివంతమైన బాంబును తయారు చేసి ‘అన్ని బాంబులకు తండ్రి’ అని పేరు పెట్టింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్