Magazines

చిన్నస్వామిలో సిరీస్‌ వేట

4 గంటల క్రితం

Chinnaswamy
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

సిరీస్‌ విజయంపై ఇరు జట్ల గురి
భారత్‌, వెస్టిండీస్‌ నిర్ణయాత్మక టీ20 నేడు

రాత్రి 7 నుంచి స్టార్‌‌స్పోర్ట్స్‌‌లో..

పరుగుల సునామీ సృష్టించిన ఐదు మ్యాచ్‌‌ల టీ20 రసవత్తర ముగింపునకు చేరుకుంది. అగ్రజట్టు భారత్‌‌కు పోటీ ఇవ్వగలదా అనే అనుమానాలను పటాపంచలు చేసిన విండీస్‌ 2019 తర్వాత భారత్‌‌లో టీ20 సిరీస్‌ ‌నెగ్గిన తొలి జట్టుగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. భీకర బ్యాటింగ్‌ ‌లైనప్‌‌తో హైదరాబాద్‌‌లో విజయం లాంఛనమే అనుకున్నా.. బోల్తా పడిన భారత్‌ ‌నేడు చిన్నస్వామిలో చావోరేవో తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ ‌చేజారితే సొంతగడ్డపై వరుస సిరీస్‌ ‌విజయాల రికార్డు గల్లంతు కానుంది.


​నవతెలంగాణ-బెంగళూరు

భారత్, వెస్టిండీస్‌ ‌పొట్టి సిరీస్‌ ‌వేట చిన్నస్వామికి చేరుకుంది. ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌ 2-2తో సమం కాగా.. నేడు బెంగళూరులో శ్రేయస్‌, హోప్‌ ‌సేనలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. సొంతగడ్డపై సిరీస్‌ ‌నిలుపుకోవాలనే పట్టుదల భారత శిబిరంలో కనిపిస్తుండగా.. భారత్‌‌పై టీ20 సిరీస్ విజయంతో సత్తా చాటేందుకు కరీబియన్లు ఎదురుచూస్తున్నారు. కెప్టెన్‌‌గా శ్రేయస్‌ అయ్యర్‌‌కు సైతం ఈ సిరీస్‌ ‌ఫలితం కీలకం కానుంది.

​ఈ జోరు సరిపోదు!

సంజు శాంసన్‌ ‌నిలకడగా రాణిస్తున్నా.. ఈ సిరీస్‌‌లో సెంచరీ చేయలేదు. రెండు అర్థ సెంచరీలు చెమట పట్టకుండా కొట్టేశాడు. హైదరాబాద్‌‌లో రోస్టన్‌‌ ఛేజ్‌ ‌బౌలింగ్‌‌లో అభిషేక్‌ ‌శర్మ ఇబ్బంది పడగా.. పవర్‌‌ప్లేలో అతడిని శాంసన్‌ ఊచకోత కోశాడు. మూడు ఓవర్లలోపే అర్థ సెంచరీ బాది అదరగొట్టాడు. లెఫ్డ్‌ ‌హ్యాండ్‌ ‌బ్యాటర్లను ఇరకాటంలో పడేస్తున్న ఛేజ్‌.. అభిషేక్‌‌తో పాటు ఇషాన్‌ ‌కిషన్‌‌ను ఇబ్బంది పెడుతున్నాడు. పవర్‌‌ప్లేలో ఛేజ్‌‌ను ఎదుర్కొనేందుకు సంజు శాంసన్‌ ‌నేటి మ్యాచ్‌‌లో కీలకం కానున్నాడు. పవర్‌‌ప్లేలో వికెట్‌ ‌నిలుపుకున్నా అభిషేక్‌ ‌శర్మ హైదరాబాద్‌‌లో దారుణంగా నిరాశపరిచాడు. ఉత్కంఠభరిత ఛేదనలో కీలక దశలో తిలక్‌ ‌వర్మ వికెట్‌ ‌కోల్పోవటం భారత్‌‌కు ప్రతికూలంగా మారింది. నమ్మకమైన మ్యాచ్‌ ‌విన్నర్‌‌గా ఎదిగేందుకు తిలక్‌ ‌వర్మ హైదరాబాద్‌ ‌తరహా ఛేదనలను ముగించాలి. మరి, చిన్నస్వామిలో అటువంటి అవకాశం లభిస్తే తిలక్‌ ‌వర్మ ఏం చేస్తాడో చూడాలి.

​అతనొక్కడే విండీస్‌ ‌సైన్యం!

వెస్టిండీస్‌కు ఆ జట్టు కెప్టెన్‌ ‌షయ్‌ ‌హోప్‌ అతిపెద్ద బలం. అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో అతడు నిలిస్తేనే కరీబియన్లు గెలుపు గీత తాకగల్గుతున్నారు. షయ్‌ ‌హోప్‌‌ను భారత్‌‌ను అవుట్‌ ‌చేయటంలో మూడు సార్లు విఫలమవగా, ఈ మూడు మ్యాచ్‌‌ల్లోనూ విండీస్‌‌దే పైచేయిగా నిలిచింది. హోప్‌‌ను అవుట్‌ ‌చేసిన నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ (రెండు వన్డేలు, రెండు టీ20లు) భారత్‌ ‌పైచేయి సాధించింది. దీంతో చిన్నస్వామిలో విండీస్‌‌కు హోప్‌ ‌వికెట్‌ అత్యంత కీలకం. అతడు క్రీజులో నిలిస్తే మరో ఎండ్‌ ‌నుంచి సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడు. లేదంటే, ఇతర బ్యాటర్లు ఒత్తిడిలో చేతులెత్తేస్తున్నారు. భారత పర్యటనలో హోప్‌ ‌నాలుగు సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఏ విదేశీ బ్యాటర్‌ ఐదు సెంచరీలు చేయలేదు. ఆ అరుదైన రికార్డు షయ్‌ ‌హోప్‌ను ఊరిస్తోంది.

​పిచ్‌, వాతావరణం

చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌ ‌స్వర్గధామం. ఐపీఎల్‌‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌‌ల్లోనూ ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. చిన్నస్వామి బౌండరీలు సైతం చిన్నవే. దీంతో సహజంగానే ఇక్కడ పరుగుల వరద ఊహించవచ్చు. శనివారం మ్యాచ్‌‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ స్టేడియంలో ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. వర్షం నిలిచిన నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌‌కు పిచ్‌‌ను సిద్ధం చేయగలరు.

​తుది జట్లు (అంచనా)

భారత్‌ : అభిషేక్‌ ‌శర్మ, సంజు శాంసన్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), ఇషాన్‌ ‌కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (‌కెప్టెన్), తిలక్‌ ‌వర్మ, నమన్‌ ‌ధిర్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, అక్షర్‌ ‌పటేల్‌, ప్రిన్స్‌ ‌యాదవ్‌, మయాంక్‌ ‌యాదవ్‌, భువనేశ్వర్‌ ‌కుమార్‌.

వెస్టిండీస్‌ : షయ్ హోప్‌ (‌కెప్టెన్‌, వికెట్‌ ‌కీపర్‌), జెవెల్‌ అండ్రూ, షిమ్రోన్‌ ‌హెట్‌‌మయర్‌, రోవ్‌‌మాన్‌ ‌పావెల్‌, షెర్ఫేన్‌ ‌రూథర్‌‌ఫోర్డ్‌, రొమారియో షెఫర్డ్‌, రోస్టన్‌ ‌ఛేజ్‌, షమర్‌ ‌స్పింగర్‌, కీమో పాల్‌, షమర్‌‌ జొసెఫ్‌, మోతీ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్