Magazines

చరిత్ర సృష్టిస్తారా?

1 గంట క్రితం

history
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 3 నిమిషాల చదవడం

ధోనీ కెప్టెన్సీలో భారత్‌ అన్ని జట్లపై గెలుపోటముల రికార్డు పాజిటివ్‌. కానీ ఒక్క జట్టుపై మాత్రం నెగెటివ్‌ ‌రికార్డు. విరాట్‌ ‌కోహ్లి కెప్టెన్‌‌గా ఆడిన ప్రతి విదేశీ సిరీస్‌‌ను సాధించాడు. కానీ ఒక్క జట్టుపై సాధ్యపడలేదు. రోహిత్‌ ‌శర్మ కెప్టెన్‌‌గా స్వదేశంలో జైత్రయాత్ర చేసినా.. ఆ ఒక్క జట్టుపై ఏకంగా సొంతగడ్డపైనే ఓటమి చవిచూశాడు. టెస్టుల్లో ధోని, కోహ్లి, రోహిత్‌‌లకు సైతం కొరకరాని కొయ్యగా మిగిలిన ఆ జట్టు న్యూజిలాండ్‌. ఇప్పడు ఆ న్యూజిలాండ్‌‌పై యువ నాయకుడు శుభ్‌‌మన్‌ ‌గిల్ దండయాత్రకు సిద్ధమయ్యాడు. కివీస్‌‌పై సిరీస్‌ ‌విజయంతో గిల్‌ ‌చరిత్ర సృస్టిస్తాడా? భారత్‌, న్యూజిలాండ్‌ ‌తొలి టెస్టు నేటి నుంచి షురూ.


నేటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు

తెల్లవారుజామున 3.30 నుంచి సోనీనెట్‌‌వర్క్‌లో..


నవతెలంగాణ-వెల్లింగ్టన్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌ ‌పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, టీమ్‌ ఇండియా నాల్గో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌ ‌విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకేందుకు భారత్‌ ఎదురుచూస్తుండగా.. అగ్రస్థానం మరింత సుస్థిరం చేసుకునేందుకు న్యూజిలాండ్‌ ‌సిద్ధమవుతోంది. పేస్‌, స్వింగ్‌ ‌స్వర్గధామ పిచ్‌‌లపై సహజంగానే ఆతిథ్య న్యూజిలాండ్‌ ‌ఫేవరేట్‌‌గా కనిపిస్తోండగా.. టీమ్‌ ఇండియా చరిత్ర తిరగరాయాలని చూస్తోంది. వెల్లింగ్టన్‌‌లోని బేసిన్‌ ‌రిజర్వ్‌ ‌గ్రౌండ్‌‌లో భారత్‌, న్యూజిలాండ్‌ ‌తొలి టెస్టు గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆరంభం కానుంది.

​పంత్‌ ‌మెరుస్తాడా?

టెస్టు క్రికెట్‌‌లో రిషబ్‌ ‌పంత్‌ ‌సూపర్‌‌స్టార్‌. ఈ ఫార్మాట్లో బాదిన 8 సెంచరీల్లో ఐదు ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాలోనే సాధించాడు. న్యూజిలాండ్‌‌లో రెండు టెస్టులు ఆడినా, అప్పటికి పంత్‌ ‌యువకుడే. కివీస్‌ ‌నిలకడగా బ్యాటర్లపై ఒత్తిడి పెంచగల బౌలింగ్‌ ‌లైనప్‌ ‌కలిగి ఉండటం, పొడగాటి పేసర్లు అదనపు బౌన్స్‌‌తో ఇరకాటంలో పడేసే అవకాశాలు మెండు.. దీంతో ఇక్కడ పంత్‌ ‌రాణించటం అంత సులువు కాదు. తనదైన విలక్షణ షాట్లను ఇక్కడ ఆడటం సైతం ప్రమాదకరమే. అయితే, సవాళ్లను స్వీకరించే పంత్‌ ‌కివీస్‌‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. గాయం నుంచి కోలుకుని నేరుగా తొలి టెస్టులో ఆడనున్న పంత్‌ ‌భారత్‌‌కు అత్యంత కీలకం. యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ ‌రాహుల్‌, దేవదత్‌ ‌పడిక్కల్‌, శుభ్‌‌మన్‌ ‌గిల్‌‌తో కూడిన బ్యాటింగ్‌ ‌లైనప్‌ ‌బాగానే ఉంది. కానీ, ఇక్కడ అనుభవం లేకపోవటం ప్రతికూలం. స్పిన్‌ ఆల్‌‌రౌండర్‌‌గా రవీంద్ర జడేజా, పేస్ ఆల్‌‌రౌండర్‌ అన్షుల్‌ ‌కాంబోజ్‌ ‌తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. కానీ వాషింగ్టన్‌ ‌సుందర్‌, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నుంచి గట్టి పోటీ నెలకొంది. జశ్‌‌ప్రీత్‌ బుమ్రాకు తోడు మహ్మద్‌ ‌సిరాజ్‌, ఆకాశ్‌ ‌దీప్‌, ప్రసిద్‌ ‌కృష్ణ, గుర్నూర్‌ ‌బరార్‌లలో ముగ్గురు తుది జట్టులో నిలువనున్నారు.

​జోరుమీదున్న కివీస్‌

సొంతగడ్డపై న్యూజిలాండ్‌ ‌ఫేవరేట్‌‌గా బరిలోకి దిగుతోంది. మాట్‌ ‌హెన్రీ వన్డే సిరీస్‌‌లో ఒక్క మ్యాచ్‌‌లోనే ఆడినా.. తొలి ఓవర్లోనే మూడు వికెట్లతో ఎంతటి ప్రభావం చూపించాడో చూశాం. కైల్‌ ‌జెమీసన్‌, జాకబ్‌ ‌డఫ్ఫీ, నాథన్‌ ‌స్మిత్‌‌లు సైతం హెన్రీకి జత కలిస్తే పచ్చిక పిచ్‌‌పై వికెట్ల వేటకు ఆటంకమే ఉండదు!. మిచెల్‌ ‌శాంట్నర్‌‌కు గాయంతో గ్లెన్‌ ‌ఫిలిప్స్‌ ‌స్పిన్‌ ఆల్‌‌రౌండర్‌‌గా జట్టులోకి రానున్నాడు. కెప్టెన్‌ ‌టామ్‌ ‌లేథమ్‌, డెవాన్‌ ‌కాన్వే, హెన్రీ నికోల్స్‌, రచిన్‌ ‌రవీంద్ర, డార్లీ మిచెల్‌ ‌సహా టామ్‌ ‌బ్లండెల్‌ ‌న్యూజిలాండ్‌ ‌బ్యాటింగ్‌ ‌భారం మోయనున్నారు.

​పిచ్‌, వాతావరణం

బేసిన్‌ ‌రిజర్వ్‌‌లో పచ్చిక పిచ్‌ ‌సిద్ధం చేశారు. కానీ ఈ పచ్చిక కొన్నిసార్లు ఒక్క సెషన్లోనే తుడిచిపెట్టుకుపోతుంది. తొలి రెండు ఇన్నింగ్స్‌‌లో, తర్వాతి రెండు ఇన్నింగ్స్‌‌లు భిన్నమైన పిచ్‌‌పై ఆడిన పరిస్థితులు ఉండే అవకాశం లేకపోలేదు. బలమైన గాలులు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌‌ను సవాల్‌‌గా మార్చనున్నాయి. టాస్‌ ‌నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

​తుది జట్లు (అంచనా)

భారత్‌ : యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ ‌రాహుల్‌, దేవదత్‌ ‌పడిక్కల్‌, శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (‌కెప్టెన్‌), రిషబ్‌ ‌పంత్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), ధ్రువ్‌ ‌జురెల్‌, రవీంద్ర జడేజా, నితీశ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి/అన్షుల్‌ ‌కాంబోజ్‌, జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా, మహ్మద్‌ ‌సిరాజ్‌, ప్రసిద్‌ ‌కృష్ణ.

న్యూజిలాండ్‌ : టామ్‌ ‌లేథమ్‌ (‌కెప్టెన్‌), డెవాన్‌ ‌కాన్వే, హెన్రి నికోల్స్‌, రచిన్‌ ‌రవీంద్ర, డార్లీ మిచెల్‌, టామ్‌ ‌బ్లండెల్‌ (‌వికెట్‌ ‌కీపర్‌), గ్లెన్‌ ‌ఫిలిప్స్‌, నాథన్‌ ‌స్మిత్‌, కైల్‌ ‌జెమీసన్‌, మాట్‌ ‌హెన్రీ, జాకబ్‌ ‌డఫ్ఫీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్