నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసముంటున్న ప్రముఖ సినీ నటి గోగినేని అనిత సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం అన్వేషించారు.
ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరుతో ఓ సైబర్ కేటుగాడు ఆమెను సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని నమ్మబలికాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి డెబిట్ కార్డు వివరాలు తెలపాలని కోరగా, నిజమైన ట్రావెల్ ఏజెంటేనని నమ్మిన నటి అనిత తన డెబిట్ కార్డు వివరాలను అందజేశారు. ఆ తర్వాత బుకింగ్ కోసం అడిగిన ఓటీపీ (OTP) నంబర్‌ను సైతం ఆమె వెల్లడించారు.
కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ‘క్లియర్ ట్రిప్’ (Cleartrip) పేరిట రూ.4,14,180 నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే, డబ్బులు కట్ అయినప్పటికీ ఎంతకీ టికెట్ బుకింగ్ వివరాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన నటి అనిత.. తాను మోసపోయానని గ్రహించారు. వెంటనే ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)