Magazines

ఘోర విషాదం..స్కూల్ పైకప్పు కూలి 29 మంది మృతి..

15 అక్టోబర్, 2026

Horrific tragedy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పాకిస్థాన్‌లో గురువారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 28 మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయురాలు సహా మొత్తం 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

పెషావర్‌లోని దిర్ కాలనీ ప్రాంతంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నట్లు నగర పోలీస్ చీఫ్ మియాన్ సయీద్ వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పాఠశాల యజమానిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే చర్యలు చేపట్టాయి.

ఈ దుర్ఘటనలో ఆరుగురు బాలికల సహా 28 మంది విద్యార్థులు, ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారని లేడీ రీడింగ్ ఆసుపత్రి ప్రతినిధి మహమ్మద్ అసిమ్ ధృవీకరించారు. మరణించిన చిన్నారులందరూ 13 ఏళ్లలోపు వారేనని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు వివరించారు.

భవనం కూలిన ఘటనపై పెషావర్ డిప్యూటీ కమిషనర్ అఫాక్ వజీర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ దారుణ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రావిన్స్ గవర్నర్ ఫైజల్ కరీం కుండి కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్