కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ రెండో సంవత్సరం చదువుతున్న డాకూరి చంద్రకళ (23) ఆత్మహత్య ఘటనపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబుమంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. షాద్‌నగర్‌కు చెందిన ఎస్సీ విద్యార్థిని చంద్రకళ కూలి పనులు చేసుకునే నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి న్యాయ విద్యను అభ్యసిస్తున్నదని, చదువులో చురుకుగా ఉండటంతో పాటు ఎస్ఐ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నదని తెలిపారు. మహిళా సమస్యలపై చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ, సెలవు రోజుల్లో పేద పిల్లలకు చదువు, కరాటే నేర్పిస్తూ సామాజిక బాధ్యతలు నిర్వహించేదని పేర్కొన్నారు. గజ్జల హరికృష్ణ వేధింపులు, మోసం ఈ ఘటనకు కారణమై ఉండొచ్చనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థినులపై వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.






కామెంట్లు (0)