Magazines

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన

1 గంట క్రితం

Protest demanding justice for the affected family
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

అంబేద్కర్‌ ‌చౌరస్తాలో తోపులాట..ఉద్రిక్తత

రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని జేఏసీ డిమాండ్‌

నవతెలంగాణ - అచ్చంపేట

అచ్చంపేట పట్టణంలోని భవాని ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని ప్రజాసంఘాల నాయకులు కుటుంబ సభ్యులు బహిర్గతంగా ఆరోపించారు. బంధువులు తెలిపిన వివరాలు... బల్మూరు మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన మహిళా ఐదు రోజుల కింద భవాని ఆస్పత్రిలో డెలివరీ కోసం చేరింది. వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. డిశ్చార్జ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలో బాలింతకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. దీంతో వైద్యులు ఆమెను పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చారు.

ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి కోమాలోకి జారుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన హైదరాబాద్ కు తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో బాలాజీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి, బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయాలని, ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వినకపోవడంతో తోపులాటకు దారితీసింది. బాధిత బంధువులకు సహకరిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

​రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి

వైద్యం వికటించి మృతి చెందిన బాలింత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, చావుకు కారణమైన డాక్టర్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ రద్దు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్ సాయి మహారాజ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి మహారాజ్ మాట్లాడుతూ ప్రసవం జరిగిన మహిళకు వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గతంలో ఇదే ఆస్పత్రిలో ఓ శిశువు మృతి చెందిందని ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మాణం చేసినప్పటికీ వైద్యులను నియమించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్