రైతు నవీన్‌కుమార్ విజయగాథ స్ఫూర్తిదాయకం
తుపాన్ నేపథ్యంలో పంట కోతలను వాయిదా వేసుకోవాలి
ఎల్‌నినో నేపథ్యంలో చిరుధాన్య, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యంతో పాటు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సమీకృతం చేసుకొని సాగు చేపట్టాలనీ, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా రైతులు నష్టాలను అధిగమించవచ్చని అన్నారు. మురసు తుపాన్ ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ, పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన రైతునేస్తం 113వ ఎపిసోడ్లో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రిటైర్డ్ సైనిక మేజర్, ప్రకృతి వ్యవసాయ రైతు సీహెచ్. నవీన్ కుమార్ తన సమీకృత వ్యవసాయ విజయగాథను రైతులతో పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి 15 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, మునగ, నేపియర్గడ్డి, బంతిపూల సాగుతో పాటు పాడి పశువులు, నాటు కోళ్లు, చేపల పెంపకం చేస్తున్న తీరును వివరించారు. తన వ్యవసాయ క్షేత్రంలో బయో రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసి ఇతర రైతులకు సేంద్రియ ఎరువులు, జీవ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్‌ను మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. సైన్యంలో దేశానికి సేవలందించిన అనంతరం వ్యవసాయ రంగంలోనూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం అభినందనీయమని కొనియాడారు. సమీకృత వ్యవసాయ విధానాలను ఇతర రైతులు కూడా అనుసరించాలనీ, తమ భూమి, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకొని ప్రతి నీటి బొట్టును సమర్థంగా ఉపయోగించుకోవాలని అన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తక్కువ నీటితో సాగు చేసుకునే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన సలహాలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులతో మంత్రి తుమ్మల ముఖాముఖి నిర్వహించారు. రైతునేస్తం కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, ఆర్టీసీ ఎమ్డీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)