Magazines

డిసెంబర్ 15 నుంచి 
నిరవధిక సమ్మెకు సిద్ధం

1 గంట క్రితం

Preparing for an indefinite strike starting December 15
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రభుత్వానికి సీఐటీయూ, బీఆర్‌‌టీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశాల సమ్మె నోటీసు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలనీ, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ రాష్ట్ర యూనియన్ (సంయుక్త సాధన కమిటీ) డిమాండ్ చేసింది. తమ సమస్యలను పరిష్కరించకపోతే 2026 డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ముషారఫ్‌ అలీకి సీఐటీయూ-బీఆర్‌‌టీయూ-ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసును అందజేశారు. కార్యక్రమంలో ఆశాయూనియన్‌ (‌సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, ఆర్‌.నీలాదేవి, ఆశాయూనియన్‌(ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.కవిత, ప్రధాన కార్యదర్శి రజిని, ఆశాయూనియన్‌(‌బీఆర్‌‌టీయూ అనుబంధం) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్‌.సంతోష, బి. మంజుల, గంగమణి(సీఐటీయూ), స్వరూప(బీఆర్‌‌టీయూ), తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కమిషనర్‌ ‌దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు 20 ఏండ్లుగా వైద్యారోగ్య శాఖలో సేవలందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సేవలు అందించడంతో పాటు ప్రసవ సమయంలో తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడటంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆశా వర్కర్లతో అనేక రకాల పనులు చేయిస్తున్నప్పటికీ తగిన వేతనాలు, సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి పని భారం ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 మాత్రమే పారితోషికంగా చెల్లిస్తున్నారని, ఐదేళ్లుగా పారితోషికాలు పెంచలేదని కమిషనర్‌ ‌దృష్టికి తీసుకెళ్లారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల ప్రసూతి ప్రయోజనం కల్పించాలని విన్నవించారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.5 లక్షలు చెల్లించాలనీ, వైద్య ఆరోగ్య శాఖలో ప్రమోషన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు, ఆరు నెలల వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. రెండో పీఆర్సీలో ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.30,000గా నిర్ణయించాలనీ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్