ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు సంఘటితంగా పోరాడాలి
ఆవిర్భావ దినోత్సవంలో
వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్,
ఇతర ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓటు పరిరక్షణకై యువత ఉద్యమించాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని రాష్ట్ర కార్యాలయం దగ్గర డీవైఎఫ్ఐ జెండాను డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ఓటు హక్కు పరిరక్షణ కోసం యువత ఉద్యమించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా యువతీ, యువకులను సమీకరించి అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర డీవైఎఫ్ఐ సంఘానికి ఉందని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని అమలు చేయకుండా యువతకు ఉపాధి కల్పించకుండా బీజేపీ సర్కార్ జాబ్ చోరీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున సర్ ప్రక్రియతో ఫారం 6లో ఉన్న నిబంధనలతో విద్యార్థి యువత ఓట్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజల ఓట్లను తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి ఏజెంట్ గా పని చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతో ఓట్లను తొలగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు చోరీకి పాల్పడ్డ జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేయాలని, జాబ్ చోరికి పాల్పడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే గద్దె దిగాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఉద్యమాలు నిర్వహిస్తున్న విద్యార్థి, యువత పైన కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని దుయ్యబట్టారు. నిర్బంధాలను లెక్కచేయకుండా యువత పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకీ వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఓటు పరిరక్షణకు యువత ఉద్యమించాలని వెంకట్ పిలుపునిచ్చారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. స్కైలాబ్ బాబు, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ లు మాట్లాడుతూ డీవైఎఫ్ఐ ఒకవైపు యువజనుల హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే మరోవైపు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నదని తెలిపారు. రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, శ్రమదానాలు నిర్వహిస్తోందని, మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడానికై క్రీడాపోటీలను నిర్వహిస్తుందని అభినందించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టీ.నాగరాజులు మాట్లాడుతూ దేశంలో అందరికీ విద్య, ఉపాధి ఉండాలని నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన సమస్యలపై డీవైఎఫ్ఐ ఉద్యమిస్తుందని అన్నారు. నూతన విద్య విధానంతో మోడీ ప్రభుత్వం విద్యను దూరం చేస్తుందని వారు విమర్శించారు. జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన పరీక్ష పేపర్స్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
15 లక్షల మందితో మొదలై కోటి మంది యువత సభ్యులుగా డీవైఎఫ్ఐ
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు మాట్లాడుతూ 1980లో పంజాబ్లోని లూథియానాలో నవంబర్ 1,2,3 తేదీల్లో డీవైఎఫ్ఐ ఏర్పడిందని గుర్తుచేశారు. 15 లక్షల యువత సభ్యత్వంతో ప్రారంభమై ఇప్పుడు కోటి యువజనుల సభ్యత్వంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ”అందరికి విద్య -అందరికీ ఉపాధి’ అనే నినాదంతో అన్ని రాష్ట్రాల్లో అనేక పోరాటాలు నిర్వహించిందని ప్రజాస్వామ్య హక్కులకై నిలబడి హక్కులడిగితే రావు పోరాడి సాధించాలని యువతను చైతన్యవంతం చేస్తుందని చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యతో పాటు కార్మికులు, కర్శకులు చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తోందని డీవైఎఫ్ఐ 47 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో దేశ సమైక్యతా, సమగ్రతకై పాటుపడుతుందన్నారు. రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసి యువతకు అండగా నిలబడి ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని, అవినీతి అంతం కావాలని ఉద్యమాలు నిర్వహించిందని అన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ”అవినీతి అంతం -డీవైఎఫ్ఐ పంతం ” అని నినదిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిందని తెలిపారు. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలను, ఆదర్శ వివాహాలను ప్రోత్సహించిందని, కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహిస్తుందన్నారు.
కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్న వారికీ రక్షణ చట్టాలు చేయాలని ఉద్యమిస్తోందని చెప్పారు. గ్రూప్స్, డీయస్సీ, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగ యువతని సమీకరించి దశల వారి ఉద్యమాలను చేపడుతుందని వెల్లడించారు. యువజనోద్యమ పోరాటాల సారథి డీవైఎఫ్ఐ చేసే పోరాటాల్లో యువత భాగస్వాములవ్వాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటి సభ్యులు ఎం.మమత, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి జావిద్, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామర కిరణ్, అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు దేవేందర్, రాజు, జె. రమేష్ తారా సింగ్, కార్తీక్ భరత్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)