నవతెలంగాణ – హైదరాబాద్: ప్రయాణికురాలితో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీఎస్‌ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతిచెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రవళిక మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక కోలుకుని తిరిగి విధుల్లో చేరుతారని ఆశించామని, కానీ ఆమె మరణించడం ఎంతో బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలు బానోతు మౌనికకు, కండక్టర్ ప్రవళికకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద కదులుతున్న బస్సు నుంచి ప్రవళికను ప్రయాణికురాలు బయటకు తోసేయడంతో వెనుక చక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.





కామెంట్‌లు (0)