- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబి
నవతెలంగాణ-హైదరాబాద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు దిగ్భ్రాంతి కలిగించిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబి పేర్కొన్నారు. ఈ తీర్పును ఖండిస్తున్నామని అన్నారు. సామూహిక అత్యాచారం, హత్య నేరాలకు గాను శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులలో ఇద్దరికి, సుదీర్ఘ జైలు శిక్షను కారణంగా చూపుతూ వారి శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విచారణ కూడా లేకుండానే ఏళ్ల తరబడి రాజకీయ ఖైదీల మాదిరిగా జైళ్లలో మగ్గుతున్న యువ కార్యకర్తలకు కోర్టులు ఇప్పటికీ బెయిల్ మంజూరు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.
అత్యంత క్రూరమైన నేరాలలో దోషులుగా తేలిన వారిని విడుదల చేయడాన్ని కోర్టు సమంజసంగా భావిస్తోందని విమర్శించారు. కోర్టు స్వయంగా గుర్తించిన ప్రకారం, తరచుగా ఉదారంగా పెరోల్, ఫర్లో సదుపాయాలు పొందినప్పటికీ, 2022లో గుజరాత్ ప్రభుత్వం నుండి శిక్షా తగ్గింపు (రెమిషన్) పొందేందుకు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసిన నేరస్తులే వీరని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు న్యాయాన్ని నిరాకరించిందని, న్యాయం కోసం బిల్కిస్ బానో చేస్తున్న పోరాటం అందరికీ సంబంధించినదని ఎం.ఏ. బేబీ స్పష్టం చేశారు. ఆమె పోరాటానికి అండగా నిలబడతామని ఆయన తెలిపారు.







కామెంట్లు (0)