నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు స్వీట్ షాపు యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లాభమే లక్ష్యంగా స్వీట్ తయారీలో కల్తీకి తెగబడ్డారు. నకిలీ వెండి వర్క్ (సిల్వర్ ఫాయిల్) తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిఠాయిలు, పాన్, బేకరీ ఉత్పత్తులపై అలంకరణ కోసం వాడే స్వచ్ఛమైన వెండి రేకుల స్థానంలో.. ప్రమాదకరమైన అల్యూమినియం రేకులు, పొడిని తయారు చేస్తున్న నాలుగు అక్రమ తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
పోలీసుల తనిఖీల్లో 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం సిల్వర్ ఫాయిల్, 10 కేజీల అల్యూమినియం ఫ్లేక్స్, కేకుల అలంకరణకు వాడే 1 కేజీ నకిలీ సిల్వర్ కోటెడ్ షుగర్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చిన్న దుకాణాలతో పాటు పలు ప్రముఖ స్వీట్ షాపులకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని, ముఖ్యంగా పండుగల సీజన్లో భారీ ఎత్తున విక్రయాలు జరుపుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
నకిలీ వర్క్‌ను ఎలా గుర్తించవచ్చంటే:
నకిలీ వెండి రేకులను ప్రాథమికంగా ఎలా గుర్తించవచ్చో పోలీసులు వివరించారు. వెండి రేకును చేతితో రుద్దినప్పుడు అది అతి సూక్ష్మమైన పొడిగా మారిపోతే అది అసలైన వెండి. అదే అల్యూమినియం అయితే చేతితో రుద్దినప్పుడు నలిగిపోవడం, చిరిగిపోవడం లేదా చిన్న ఉండలుగా మారడం జరుగుతుంది. అలాగే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో వేస్తే అల్యూమినియం కరిగిపోయి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని, అసలైన వెండి కరగదని పోలీసులు తెలిపారు. అయితే రసాయన పరీక్షలను ల్యాబ్‌లలో నిపుణులు మాత్రమే చేయాలని వారు స్పష్టం చేశారు.







కామెంట్లు (0)