- పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్
నవతెలంగాణ-సత్తుపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్ డిమాండ్ చేశారు. సత్తుపల్లి పట్టణంలోని మాధురి ఫంక్షన్హాల్లో బుధవారం ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్ మాట్లాడుతూ... భారతదేశంలో ప్రజాపోరాటాల ద్వారా సాధించుకున్న ఓటు హక్కును సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కాలరాస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కులను తొలగించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది అర్హులైన యువత ఓట్లను తొలగిస్తూ, బీజేపీకి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
తక్షణమే ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, అక్రమంగా తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రశ్నించే వారిపై నిర్బంధకాండను ప్రయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా, యువజన వ్యతిరేక విధానాలపై యువతను చైతన్యపరిచి పీవైఎల్ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్, సహాయ కార్యదర్శులు బి.ఎస్. కృష్ణ, కొర్సం రామకృష్ణ, భీమేష్, సిద్దు, ప్రేమ్ సింగ్, మంగయ్య, కరుణాకర్, సంగం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)