నవతెలంగాణ-సత్తుపల్లి
మదర్ థెరెసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థుల కోసం 'కోడ్ తాన్ @2K26' ఫైతాన్ ప్రోగ్రామింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన 'కోడ్ తంత్ర' ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకధాటిగా 12 గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 265 మంది విద్యార్థులు ఈ ప్రోగ్రామింగ్ శిక్షణా కార్యక్రమంలో నాలుగు దశలలో పాల్గొన్నారు. కోడ్ తంత్ర నిపుణులైన ట్రైనర్స్ సి.హెచ్. చైతన్య, ఐ. స్వాతి, పి. హర్ష, కే. సురేష్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించారు.
ఆధునిక పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించడానికి అవసరమైన వివిధ సాంకేతిక నైపుణ్యాలను (టెక్నికల్ స్కిల్స్) ట్రైనర్స్ నేర్పించారు. శిక్షణ అనంతరం విద్యార్థులు తాము నేర్చుకున్న కోడింగ్ పద్ధతులను ఉపయోగించి అతి తక్కువ సమయంలో విభిన్న ప్రాజెక్టులను విజయవంతంగా రూపొందించారు. ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు, ప్రోత్సాహక బహుమతులు అందజేసి అభినందించింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తరగతి గది బోధనతో పాటు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ విద్య పూర్తి కాగానే విద్యార్థులు సులభంగా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు సాధించడానికి ఈ కోడింగ్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మదర్ థెరెసా విద్యాసంస్థల ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. ఉదయ్ కిరణ్ భార్గవ్ ఈ కార్యక్రమంలో సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి. మారేశ్వరరావు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ టి. రాఘవరాజు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)