- సత్తుపల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ
నవతెలంగాణ-సత్తుపల్లి
పేదల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం వెలుగులు నింపుతోందని, పెద్దలకు అండగా పేదలకు తోడుగా చేయూత పింఛన్ల మంజూరు చేసిందని, సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి పేదల కడుపు నింపుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సత్తుపల్లి వచ్చిన మంత్రి పొంగులేటి స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని నిలిపే ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 72 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. తొలి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 8 లక్షల ఇళ్లను రూ. 40 వేల కోట్ల వ్యయంతో మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ ఎలాంటి అవినీతికి, ప్రశ్నాపత్రాల లీకేజీలకు తావులేకుండా పారదర్శకంగా గ్రూప్-1 నుండి గ్రూప్-4 వరకు 72 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా నిలిచిపోయిన ఆసరా పింఛన్లను దీపావళి నాటికి అర్హులైన మహిళలు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కులవృత్తుల వారికి కొత్తగా మంజూరు చేశామన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
కోటి మంది డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో గడిచిన 33 నెలల్లో రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. సంక్షేమ పథకం అందని ఇల్లంటూ రాష్ట్రంలో ఎక్కడ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, కమిషనర్ కోండ్ర నరసింహ, ఎంపీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కౌన్సిలర్లు, చేయూత పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)