- డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం
- గుమ్మడివల్లి పీహెచ్‌సీకి సమ్మె నోటీసు అందజేత
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల నిర్ధిష్ట వేతనం అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు.
గురువారం గుమ్మడివల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నందిత పౌలు కు ఆశా వర్కర్ల సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య రంగంలో ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గత ఐదు సంవత్సరాలుగా ఆశా వర్కర్ల వేతనాలు పెరగలేదని తెలిపారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల నిర్ధిష్ట వేతనం ఇవ్వాలని, రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, మృతి సంభవించిన సందర్భంలో కుటుంబానికి రూ.50 వేల తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ సమయంలో రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు పారితోషికంలో సగానికి సమానమైన పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలతో పాటు పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సమత, నాగమణి, సుజాత, లక్ష్మి, చంద్రమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)