నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా కుల సంఘాల ప్రతినిధులకు జీవో ప్రతులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల మేరకు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో భూములు కేటాయించినా పరిపాలనా, సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదని, ప్రస్తుతం హెచ్‌ఎండీఏ సహకారంతో అడ్డంకులు తొలగించామని చెప్పారు. నిర్మాణాలకు అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తామని, ఏడాదిలోగా భవనాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
కుల సంఘాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. నిధులు మంజూరు చేసినందున ఆయా సంఘాలు వెంటనే నిర్మాణాలు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే అన్ని బీసీ కుల సంఘాల కార్యక్రమాల నిర్వహణకు హైదరాబాద్‌లో ఐదు ఎకరాల స్థలంలో సమగ్ర బీసీ భవన్ నిర్మించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిపారు.





కామెంట్‌లు (0)