Magazines

జిల్లాను తాకిన అర్నాబ్ తుఫాన్‌

1 గంట క్రితం

arnab tuffan
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 2 నిమిషాల చదవడం

- రెండు రోజులుగా వానలు

- అయినా  జిల్లాలో 27.1 శాతం లోటు వర్షపాతమే

- 23 మండలాల్లో 17 చోట్ల వర్షాభావ పరిస్థితులు

- అశ్వారావుపేటలో సాధారణం కంటే 33.9 శాత తక్కువ

- అక్టోబర్‌లో వర్షాలు అంతంతే


నవతెలంగాణ - అశ్వారావుపేట

సముద్రంలో ఏర్పడిన తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను మంగళవారం తాకింది. దీంతో బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో తీవ్రంగా గాలులు వీస్తున్నాయి.ఈ కారణంగా పలు చోట్ల విద్యుత్ లైన్ లు, విద్యుత్ ఫీడర్ లు ధ్వంసం అయి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఏదో రకంగా వానలు పడుతున్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షపాతం లోటు ఆందోళన కలిగిస్తోంది. 

జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 1,067.8 మిల్లీమీటర్లు కాగా, 778.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 27.1 శాతం లోటు ఏర్పడింది. జిల్లాలోని 23 మండలాల్లో 17 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటుండగా, ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

అశ్వారావుపేటలోనూ లోటే:

అశ్వారావుపేట మండలంలో ఇప్పటివరకు 656 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా కురవాల్సిన 992 మిల్లీమీటర్లతో పోలిస్తే 33.9 శాతం తక్కువగా ఉంది. అక్టోబర్‌ నెలలో ఇప్పటివరకు 14.8 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది. ఈ నెలలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 83.6 శాతం లోటు నమోదైంది.

దమ్మపేటలో అత్యధిక లోటు:

జిల్లాలో దమ్మపేట మండలం 49.9 శాతం లోటుతో అత్యంత వెనుకబడి ఉంది. భద్రాచలం మండలంలో 44.7 శాతం, మణుగూరులో 39.7 శాతం, అన్నపురెడ్డిపల్లిలో 37.6 శాతం, బూర్గంపాడులో 36.2 శాతం, పినపాకలో 35 శాతం లోటు నమోదైంది. చంద్రుగొండ మండలంలో మాత్రం సాధారణం కంటే 1.7 శాతం అధిక వర్షపాతం కురిసింది.

అక్టోబర్‌లో తగ్గిన వర్షాలు:

జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వర్షాలు నమోదైనప్పటికీ అక్టోబర్‌లో తీవ్రంగా తగ్గాయి. ఈ నెలలో సాధారణంగా 89.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 14.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.  జిల్లాలో సెప్టెంబర్ మాసాంతానికి వానాకాలం పూర్తి అయి యాసంగి సీసన్ లోకి ప్రవేశించాం. ఎల్ నినో ప్రభావం తో లోటు వర్షపాతం నమోదు అయ్యింది. అర్నాబ్ తుఫాన్ వలన ఈరోజు వర్షపాతం రికార్డు అయ్యింది.


బుధవారం ఉదయం 8.30గంటల తర్వాత జిల్లాలో పలుచోట్ల వర్షపాతం కురిసింది. పెంట్లం లో 9.3, ములకలపల్లి లో 6.5, మల్కారం లో 5.8, ఇల్లందు లో 5.5, సుజాతనగర్ లో 5.3, టేకులపల్లి లో 5, అశ్వారావుపేట లో 4, మందలపల్లి లో 3.8, జూలూరుపాడు లో 2మి. మీ. ల వర్షపాతం నమోదు అయ్యింది. ప్రస్తుతం వానాకాలం పంటలు వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, మినుము లాంటి పంటలు నిలువుమీద ఉన్నాయి. ఈ తుఫాన్ కు ముందు గత వారం రోజులుగా వరి కోతలు పినపాక, అన్నపురెడ్డిపల్లి మరియు దమ్మపేట మండలాల్లో వేయి ఎకరాలకు పైగా కోతలు పూర్తి అయ్యాయి.


మార్కెట్ లో వున్న డిమాండ్ దృష్ట్యా పచ్చి వడ్లు వరి కోతలు అయినవి అయినట్లుగానే గిట్టిబాటు ధరకు అమ్ముడుపోతున్నాయి. అదే విధంగా పత్తి తీత కూడా మొదలయ్యింది. తుఫాన్ వలన, వరి కోతలు మరో రెండు రోజులవరకు వేచి ఉండటం మంచిది.ఇప్పుడిప్పుడే యాసంగి పంటలుగా విత్తిన వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు ఈ తుఫాన్ వర్షం లాభాదాయకం. ఈ మధ్యనే నాటిన ఆయిల్ పామ్ మొక్కలు మంచిగా నాటుకోడానికి దోహదపడుతుంది. లోటు వర్షపాతం మరియు అడుగంటుతున్న భూగర్బజలాలు నేపథ్యంలో ఈ తుఫాన్ రైతులకు మేలే చేస్తుంది.  వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల నిర్వహణ మరియు యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్