- ఈ నెల 19 నుండి గ్రామ పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై సమీక్ష సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా ప్రభుత్వం అమలు చేయనుందని, ఈ నెల 19 నుంచి గ్రామ పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రావెళ్ల చిన్న నాగేశ్వరరావు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి చందన్ అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో చిన్న నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల కుటుంబ యజమాని అర్హులని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఆయా ఆవాస ప్రాంతాలలో (హ్యాబిటేషన్లలో) కౌంటర్ల వారీగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే లబ్ధిదారులు తమ వెంట ఆధార్ కార్డు, రేషన్ కార్డు నకళ్లను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని ఆయన కోరారు.య్కయ్క అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా నష్టపోకుండా అందరితో దరఖాస్తులు చేయించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి చందన్, మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) జ్యోత్స్న, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)