- కళాశాల ఏడీ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం భవన సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన కళాశాలలో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ శనివారం నవతెలంగాణ కు తెలిపారు.
విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ విభాగం బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ విధానంలో బోధన అందించేందుకు తరగతి గదులను సిద్ధం చేస్తోంది. విద్యార్థినులు, విద్యార్థుల వసతి కోసం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వేర్వేరుగా భవనాలను ఏర్పాటు చేయనున్నారు. కళాశాల కార్యాలయ నిర్వహణ కోసం ఉద్యాన పరిశోధనా స్థానం ఆవరణలోని పాత భవనాన్ని పునరుద్ధరించనున్నారు.
నూతనంగా ఏర్పాటైన ఈ కళాశాలకు 30 సీట్లు కేటాయించగా, మొదటి విడత కౌన్సెలింగ్లో 22 మంది సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా, తొమ్మిది మంది చేరారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, మూడో విడత తోపాటు చివరి మాప్అప్ దశలో మరికొందరు విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్,ఉద్యాన విశ్వవిద్యాలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్,బోధన సిబ్బంది పాల్గొన్నారు







కామెంట్లు (0)