Magazines

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమకు ఫలితం దక్కేది ఎప్పుడు

9 గంటల క్రితం

pscwu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

- టీయూసీఐ రీజియన్ అధ్యక్షుడు అమర్లపూడి శరత్

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలు ఎప్పుడు తీరుతాయని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (పీఎస్సీడబ్ల్యూయూ) రీజియన్ అధ్యక్షుడు అమర్లపూడి శరత్ ప్రశ్నించారు. గురువారం సింగరేణి క్వార్టర్స్ ఏరియాలో నిర్వహించిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ​సింగరేణి సంస్థ రూ. 1,754 కోట్ల వార్షిక లాభాలను ప్రకటించడం అభినందనీయమని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వడం మంచి పరిణామమని శరత్ తెలిపారు. అయితే, ఈ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల రెక్కల కష్టం కూడా ఉందనే విషయాన్ని ప్రభుత్వం, యాజమాన్యం గుర్తించాలని కోరారు.


గడిచిన  తొమ్మిది సంవత్సరాలుగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో నెలకు పదివేల రూపాయల జీతం కూడా లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. కేవలం సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్ వారి కడుపు నింపదని స్పష్టం చేశారు.

​అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.


రోజువారీ వేతనం పెరిగితేనే కార్మికులు తమ పిల్లలకు మంచి ఆహారం, వైద్యం అందించగలరని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి కనీసం 10 శాతం లాభాల వాటాను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని, తక్షణమే వారి వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ నాయకులు రమేష్, నాగేశ్వరరావు, స్వాతి, పవన్, చిట్టెమ్మ, కళావతి, రమాదేవి, బాబు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్