17 మండలాల నుంచి 450 మంది క్రీడాకారుల రాక
70వ పాఠశాల క్రీడా సమాఖ్య అండర్-17 జిల్లా స్థాయి పోటీలు నేటి నుంచి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఆలేరు మండలం కొలనుపాక గ్రామం వేదికగా నిలవనుంది.యాదాద్రి భువనగిరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 70వ పాఠశాల క్రీడా సమాఖ్య అండర్-17 బాలబాలికల ఖోఖో జిల్లా స్థాయి పోటీలకు కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం ముస్తాబైంది. నేడు (నవంబర్ 6) ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోటీలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి సుమారు 450 మంది బాలబాలికల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
క్రీడాకారులకు అవసరమైన మైదానాలు, క్రీడా వసతులు, ఇతర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి కే. దశరథ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగాయి. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్, వినోద్, మాదాను జోసఫ్, మల్లేశం, బాలాజీ, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, మధు, రవీందర్, సంపత్, మల్లేష్ తదితరులు మైదానాల సిద్ధం నుంచి ఇతర ఏర్పాట్ల వరకు చురుగ్గా పాల్గొని సహకరించారు.
క్రీడాస్ఫూర్తికి వేదికగా కొలనుపాక
క్రీడలు కేవలం గెలుపోటములకే పరిమితం కావు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, జట్టుకృషి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. జిల్లా స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, ఉన్నత స్థాయి పోటీలకు ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 17 మండలాల క్రీడాకారుల రాకతో కొలనుపాకలో క్రీడా సందడి నెలకొననుంది.






కామెంట్లు (0)