Magazines

లారీ అసోసియేషన్ ఎన్నికల్లో కొండపల్లి రమేష్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం

5 గంటల క్రితం

Kondapalli Ramesh
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 2 నిమిషాల చదవడం

- 150 ఓట్ల మెజారిటీతో అధ్యక్షుడిగా రమేష్ రెడ్డి ఎన్నిక

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి లోని శ్రీబండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల  ఆవరణలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా జరిగిన సత్తుపల్లి 'ది సింగరేణి లారీ అసోసియేషన్' ఎన్నికల్లో రావి నాగేశ్వరరావు వర్గానికి చెందిన కొండపల్లి రమేష్ రెడ్డి ప్యానెల్ క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది. ఎన్నికల అధికారిగా కూకలకుంట రవికుమార్, సహాయ అధికారులుగా న్యాయవాదులు పి. దివాకర్, ఎన్. ఇందిరా ప్రియదర్శిని వ్యవహరించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా నాలుగు రోజుల పాటు సాగిన హోరాహోరీ ప్రచారం అనంతరం జరిగిన ఈ ఎన్నికల్లో అసోసియేషన్ అధ్యక్షుడిగా కొండపల్లి రమేష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ఎండీ ముఖరం హుస్సేన్‌పై 150 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.


ఉపాధ్యక్షుడిగా షేక్ కమీల్ (ఖలీల్) సమీప అభ్యర్థి వి. అచ్చిరెడ్డిపై 68 ఓట్ల ఆధిక్యంతో పొందగా కార్యదర్శిగా ఎం. మురళి తన సమీప ప్రత్యర్థి కోటేశ్వరరెడ్డిపై 96 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అలాగే సంయుక్త కార్యదర్శిగా వి. సురేష్ (యేసు) తన సమీప ప్రత్యర్థి బి. వేణుపై 78 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కోశాధికారిగా ఎన్. విజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి షేక్ మౌలాలిపై 39 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడంతో రమేష్ రెడ్డి ప్యానెల్ సంపూర్ణ విజయాన్ని నమోదు చేసింది.


​ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొండపల్లి రమేష్ రెడ్డి మాట్లాడుతూ...లారీ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని, సింగరేణి బొగ్గు రవాణా లారీలకు అత్యధిక లోడింగ్ కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభ్యులందరికీ నిత్యం అందుబాటులో ఉంటానని తెలిపారు. తమ ప్యానెల్ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రమేష్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం అసోసియేషన్ సభ్యులు పోలింగ్ కేంద్రం వద్ద టపాసులు కాల్చి  సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి పట్టణంలోని రింగ్ సెంటర్ మీదుగా లారీ అసోసియేషన్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ నాయకులు, లారీ యజమానులు, కార్యాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్