సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం పిలుపు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం మహాసభల సందర్భంగా జరిగే రైతు బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. గురువారం ఆలేరు పట్టణంలో రైతుల కల్లాలు, ఇళ్ల వద్దకు వెళ్లి సభకు సంబంధించిన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నష్టం కలిగించే నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతాంగంపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిందని విమర్శించారు.
అయితే, రైతులు ఐక్యంగా సాగించిన పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, తమ హక్కుల సాధనలో రైతు ఉద్యమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పోరాట స్ఫూర్తి ఇతర ప్రజా సంఘాల ఉద్యమాలకు మార్గదర్శకంగా మారిందన్నారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నా, రైతులను ఆదుకునేందుకు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. రైతాంగం కరువుతో అల్లాడుతుంటే మూసీ సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సి వస్తోందన్నారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం మహాసభలు భవిష్యత్తు రైతు ఉద్యమ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మించేందుకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు. నవంబర్ 15న నిర్వహించే బహిరంగ సభకు రైతులు, కార్మికులు,కర్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ. ఇక్బాల్, మోరిగాడి రమేష్, వడ్డేమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, మోరిగాడి అశోక్, మోరిగాడి రాజు, మోరిగాడి స్వరూప, మోరిగాడి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)