సామర్ధ్య వృద్ధి నిధుల వినియోగంపై నిలదీత
ఎల్ నినో ముప్పు ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికలు ఏవి..?
సమాధానం చెప్పలేక తడబడిన సంబంధిత శాఖల అధికారులు
నవతెలంగాణ-నూతనకల్
గ్రామ పంచాయతీల అభివృద్ధి,సామర్థ్య వృద్ధి రాబోయే ఎల్ నినో ముప్పు ప్రభావం పై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ అధికారులపై ప్రశ్న వర్షం కురిపించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మండల సర్వసభ్య సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అడిగిన కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు తడబడ్డారు.
అభివృద్ధి నిధులు ఏమయ్యాయి.
గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన,శానిటేషన్ తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షిస్తూ.. పంచాయతీలకు మంజూరైన నిధుల ఖర్చు అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని క్షేత్రస్థాయిలో పాలనలో మార్పు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు ..ఎల్ నినో ప్రభావం పై వాతావరణ మార్పులు,రాబోయే రోజుల్లో వర్షభావ పరిస్థితులు , భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి, పంట నష్టాలు వాటిల్లకుండా పంచాయతీల వారీగా ఏం ముందస్తు ప్రణాళికలు రూపొందించారని అధికారులను ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం పనుల్లో గుర్తింపు, చిన్న నీటి కుంటలలో పూడికతీత ,ప్రత్యమ్నయ నీటి వనరుల కల్పనపై కార్యాచరణ ఏదని అడగ్గా..అధికారుల వద్ద స్పష్టమైన నివేదికలు లేకపోవడం సమావేశంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు పొంతనలేని సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తక్షణమే పంచాయతీల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎల్ నినో ముప్పు ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపాదికన సన్నాహాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్పర్సన్ నాగం జయసుధ, మండల ప్రత్యేక అధికారి భారతి, ఎంపీడీవో సునీత, అధికారులు, గ్రామ సర్పంచులు తదితరులు ఉన్నారు.





కామెంట్లు (0)