- అశ్వారావుపేట పాత మండల పరిషత్ కార్యాలయం నేలమట్టం
- ఐదు దశాబ్దాల పరిపాలనా ప్రస్థానానికి ముగింపు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ఒకప్పుడు అశ్వారావుపేట రాజకీయాలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారుల కార్యకలాపాలకు వేదికగా నిలిచిన మండల పరిషత్ పూర్వ కార్యాలయం నేడు చరిత్ర గర్భంలో కలిసిపోయింది. సుమారు ఐదు దశాబ్దాలుగా పరిపాలనా సేవలందించిన ఆ పురాతన భవనం తాజాగా నేలమట్టమైంది.
అశ్వారావుపేట సమితిగా ఏర్పడిన తొలినాళ్లలో పట్టణంలోని మూడు రోడ్ల ప్రధాన కూడలికి సమీపంలో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో సమితి వ్యవస్థ స్థానంలో మండల వ్యవస్థ ఏర్పడటంతో ఇదే భవనం మండల పరిషత్ కార్యాలయంగా మారింది. ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ సమావేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల రాకపోకలతో ఈ ప్రాంగణం నిత్యం సందడిగా ఉండేది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నాటి ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవన సముదాయాలను నిర్మించింది. అశ్వారావుపేటలోనూ నేటి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో కొత్త భవనం అందుబాటులోకి రావడంతో పాత కార్యాలయం నిరుపయోగంగా మారి క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన నేపథ్యంలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి పాత మండల పరిషత్ కార్యాలయ స్థలాన్ని కేటాయించారు. దీంతో దశాబ్దాల చరిత్ర కలిగిన పురాతన భవన సముదాయాన్ని తొలగించారు.
ఒకప్పుడు ప్రజా పరిపాలనకు కేంద్రంగా, రాజకీయ పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఈ భవనం ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోయింది. కాలం మారింది.. పరిపాలనా వ్యవస్థ మారింది.. భవనం కనుమరుగైంది. కానీ ఆ ప్రాంగణంతో అనుబంధం ఉన్న ఎందరో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్థానికుల జ్ఞాపకాల్లో మాత్రం ఆ పాత కార్యాలయం నిలిచిపోనుంది.







కామెంట్‌లు (0)