- శిథిల భవనాల తొలగింపును అడ్డుకున్న నలుగురు వ్యక్తులు
- సిబ్బందిని బెదిరించినట్లు ఫిర్యాదు
- పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో పనులకు ఆటంకం ఏర్పడింది. మండల పరిషత్ పూర్వ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం మున్సిపల్ సిబ్బంది జేసీబీతో శిథిల భవనాలను తొలగించి నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతుండగా, పేరాయిగూడెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డుకున్నట్లు మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నార్లపాటి నాగపద్మ, నార్లపాటి శ్రీనివాసరావు, నార్లపాటి మల్లిక, నార్లపాటి రాజశేఖర్‌లు సదరు స్థలం తమదని పేర్కొంటూ మున్సిపల్ సిబ్బందిని పనులు చేయకుండా అడ్డగించి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు ఆఫీసర్ ముసికి వెంకటరమణ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ బి. సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)