నవతెలంగాణ – మల్హర్ రావు: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రాజేందర్ నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల చదువుల వివరాలు అడిగి తెలుసుకుని, బాణసంచా బహుకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు దశలవారీగా సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల సమష్టి కృషితో పథకం ముందుకు సాగుతోందన్నారు. ధన్వాడ గ్రామానికి చెందిన రాజేందర్ కుటుంబంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న పేద కుటుంబాలు తమ సొంతింట్లో తొలిసారిగా దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా జిల్లా కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల, గ్రామస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. అధికారుల సమన్వయం, ప్రజల సహకారంతోనే నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోందని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల సహకారంతో సమష్టిగా పోరాడినట్లుగానే ఎల్నినో ప్రభావాన్ని కూడా ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ధన్వాడ గ్రామ ప్రజలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీకాంత్, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిరుమల, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్లు (0)